ఎమ్మెల్సీ కవిత గొప్పమనసు... చదువుల తల్లి హారికకు ఆర్థిక సాయం

Nov 9, 2022, 3:04 PM IST

నిజామాబాద్ : మన సంకల్పం దృడంగా వుంటే అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేయాలని నిరూపించింది నిజామాబాద్ యువతి. పెద్దచదువులు చదవే ఆర్థిక స్తోమత లేకున్నా కేవలం యూట్యూబ్ లో క్లాస్ లు విని ఏకంగా ఎంబిబిఎస్ సీటు సాధించింది నిజామాబాద్ జిల్లా నాందేవ్ గూడకు చెందిన హారిక. సీటయితే సాధించింది కానీ ఎంబిబిఎస్ చదవడానికి బోలెడు డబ్బులు కావాల్సివుంటుంది. అయినా ఎంబిబిఎస్ చదవాలన్న హారిక సంకల్పం ముందు ఈ ఆర్థిక కష్టాలు కూడా తలవంచాయి. చదువులతల్లి హారిక గురించి తెలుసుకున్న సీఎం కేసీఆర్ కూతురు, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆర్థికసాయానికి ముందుకువచ్చారు. ప్రస్తుతం నిజామాబాద్ పర్యటనలో వున్న కవిత హారికను పిలిపించుకుని మాట్లాడారు. ఆమెను కేవలం అభినందించి పంపించకుండా ఎంబిబిఎస్ కోర్స్ పూర్తిచేయడానికి అయ్యే ఖర్చును భరిస్తానంటూ భరోసా ఇచ్చారు. మొదటి సంవత్సరం కాలేజీ ఫీజును కూడా హారికకు అందజేసిన కవిత ఐదేళ్ల పాటు ఇలాగే అందిస్తానని కవిత తెలిపారు.