డిల్లీ లిక్కర్ స్కాంతో నాకేం సంబంధం లేదు... ఏ విచారణకైనా సిద్దమే..: ఎమ్మెల్సీ కవిత

Aug 23, 2022, 12:21 PM IST

హైదరాబాద్ : డిల్లీ లిక్కర్ స్కాం తో సంబంధాలున్నట్లు బిజెపి నాయకులు చేస్తున్న ఆరోపణలపై సీఎం కేసీఆర్ కూతురు, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఘాటుగా స్పందించారు. ఈ స్కాంతో తనకు ఎటువంటి సంబంధం లేదని... బిజెపి కక్షపూరిత రాజకీయాల్లో ఇదీ భాగమేనని అన్నారు. దేశవ్యాప్తంగా ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు బిజెపి ప్రయత్నిస్తోందని... తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రం తీరును గట్టిగా ఎండగడుతుండటం వల్లే ఆయన కుటుంబంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఇలాంటి కక్షపూరిత రాజకీయాలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని కవిత సూచించారు. కేంద్ర ప్రభుత్వ పాలనపై వస్తున్న వ్యతిరేకత నుండి ప్రజల దృష్టి మరల్చడానికే డిల్లీ లిక్కర్ స్కాంలో తనపేరు ప్రచారం చేస్తున్నారని కవిత అన్నారు. నిజంగానే తాను తప్పుచేసివుంటే కేంద్రం చేతిలోనే అన్ని రకాల దర్యాప్తు సంస్థలు ఉన్నాయి... వాళ్లు అన్ని రకాలుగా విచారణ చేయవచ్చు... తాను పూర్తిగా సహకరిస్తానని కవిత అన్నారు. ఎంత కక్షపూరితంగా వ్యవహరించినా కేంద్రంతో పోరాటం ఆగదని.... వెనకడుగు వేసే ప్రసక్తేలేదని కవిత స్పష్టం చేసారు.