Dec 1, 2022, 4:46 PM IST
కరీంనగర్ : అతడో ఎమ్మెల్యే. నిత్యం ప్రజాసేవ, నియోజకవర్గ పనులు, రాజకీయాలతో బిజీగా వుంటాడు. ఇలాంటి బిజీ షెడ్యూల్ లోనూ విద్యార్థుల కోసం ఆయన టీచర్ అవతారమెత్తి విద్యార్థులకు స్వయంగా తెలుగు పాఠాలు బోధించారు. ఇలా చొప్పదండి టీఆర్ఎస్ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఉపాధ్యాయుడి అవతారమెత్తారు. ఎమ్మెల్యే రవిశంకర్ తన నియోజకవర్గ పరిధిలోని రామడుగు మండలం గోపాల్రావుపేట జల్లా పరిషత్ పాఠశాలలో ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో టెన్త్ క్లాస్ విద్యార్థులతో ముచ్చటించిన ఎమ్మెల్యే వారి ప్రతిభను తెలుసుకునేందుకు తెలుగు పాఠాలు బోధించారు. తెలుగు సంధుల గురించి విద్యార్థులకు ప్రశ్నలు సంధించారు. ఇలా తెలుగు మాస్టారుగా మారి విద్యార్థులకు కొద్దిసేపు పాఠాలు బోధించిన ఎమ్మెల్యేను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇక కాలేజీలో సదుపాయాలు, సమస్యల గురించి టీచర్లు, విద్యార్థులను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే వాటిని పరిష్కారానికి ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు