Aug 30, 2022, 4:16 PM IST
పెద్దపల్లి : రామగుండం ఎన్టిపిసి (నేషనల్ థర్మల్ పవర్ కార్పోరేషన్ లిమిటెడ్) లో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులు తమ సమస్యల పరిష్కారానికి ఆందోళన చేపట్టారు. 48 గంటల పాటు విధులను బహిష్కరించిన ఉద్యోగులు కార్యాలయం ఎదుట కూర్చుని ధర్నా చేపట్టారు. కాంట్రాక్ట్ కార్మికుల జేఎసి ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో భారీగా కార్మికులు పాల్గొని యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. ఎన్టిపిసి కార్మికుల ఆందోళనకు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మద్దతు తెలిపారు. కార్మికులు తమ సమస్యలు పరిష్కరించమంటే సిఐఎస్ఎఫ్ జవాన్లతో లాఠీచార్జ్ చేయించడం ఏంటని ఎన్టిపిసి యాజమాన్యాన్ని ఎమ్మెల్యే ప్రశ్నించారు. పోరాటం చేస్తున్న కార్మికులను భయాందోళనకు గురిచేసే కుట్రపూరిత ఆలోచనతో యాజమాన్యం వున్నట్లు అర్ధమవుతుందన్నారు. కార్మికులు కన్నెర్ర చేయక తప్పలేదని... యాజమాన్యం స్పందన కోసం ఎదురుచూసినా ఉలుకూ పలుకు లేకపోవడంతోనే శాంతియుత ఆందోళనకు దిగారన్నారు. వెంటనే ఎన్టిపిసి యాజమాన్యం కార్మికులకు క్షమాపణలు చెప్పి బాధ్యులైన జవాన్లు, అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యే చందర్ డిమాండ్ చేశారు.