Aug 26, 2022, 4:14 PM IST
వరంగల్ : ప్రపంచ వ్యవసాయానికి నానో యూరియా ఆదర్శంగా నిలుస్తుందని తెలంగాణ వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. తొలిసారి యూరియాను ద్రవరూపంలో నానో టెక్నాలజీలో అందుబాటులోకి తీసుకువచ్చారని... దీంతో ఎరువుల సంచులను తరలించే పెద్ద ప్రక్రియను సులభతరం చేశారన్నారు. నానో యూరియా వాడకం మూలంగా మొక్కలకు పత్రహరితం ఎక్కువగా అంది పంట వేగంగా ఎదుగుతుందన్నారు. 500 మిల్లీలీటర్ల నానో యూరియా ఒక యూరియా బస్తాతో సమానమని మంత్రి తెలిపారు. నానో యూరియా వాడకంతో మరోసారి దేశానికి దిక్సూచిలా నిలబడాలని నిరంజన్ రెడ్డి సూచించారు.ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో వ్యవసాయంలో ఎరువులు, రసాయనాల వాడకం, నానో యూరియా వాడాల్సిన ఆవశ్యకతపై జరిగిన సదస్సులో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నానో యూరియా వల్ల కలిగే ప్రయోజనాలను మంత్రి తెలంగాణ రైతాంగానికి వివరించారు.