Dec 23, 2022, 5:22 PM IST
కర్నూల్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు-నేడు పథకంలో భాగంగా కర్నూల్ జిల్లా కౌతాళం మండలం హల్వి స్కూల్లో చేపట్టిన పనుల్లో అపశృతి చోటుచేసుకుంది. కూల్చివేత పనుల్లో భాగంగా జెసిబితో గోడ కూలుస్తుండగా ఒక్కసారిగా పైకప్పు కూడా కూలింది. దీంతో పనులు జరుగుతున్న గది పక్కనే మరోగదిలో వున్న విద్యార్థులతో పాటు టీచర్ పై శిథిలాలు పడి తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఇతర విద్యార్థులు, ఉపాధ్యాయులు అప్రమత్తమై శిథిలాల్లో చిక్కుకున్న విద్యార్థులు, ఉపాధ్యాయురాలికి సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం స్థానిక హాస్పిటల్ కు తరలించారు.
ఈ ఘటనపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందిస్తూ... కోట్లు కొట్టేసేందుకు పసిపిల్లల ప్రాణాలూ పణంగా పెట్టేస్తున్న జగన్ రెడ్డి విద్యార్థులకు మేనమామ కాదు..నరహంతక రాక్షస మామ అంటూ మండిపడ్డారు. వైసీపీ సర్కారు నాడు నేడు పనుల్లో దోపిడీపై పెట్టిన శ్రద్ధ పిల్లల ప్రాణాలపై లేకపోవడం విచారకరమంటూ లోకేష్ ఆందోళన వ్యక్తం చేసారు.