Apr 13, 2023, 4:55 PM IST
కరీంనగర్ జిల్లాలో ఈత సరదా ఓ యువకుడి ప్రాణం తీసింది. తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి రిజర్వాయర్ లోని గుంతలో 20 మంది స్నేహితులు ఈతకు వెళ్లగా.. అందులో ఓ యువకుడు గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని..సహాయక చర్యలు చేపట్టారు. గల్లంతైన యువకుడు పెద్దపల్లి జిల్లా కి చెందిన నీలపు బాలరాజు (18) గా గుర్తించారు. తిమ్మాపూర్ మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో మృతుడు బాలరాజు డిప్లమా సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఎండ వేడిమికి సేద తీరాలని 20 మంది యువకులు ఎల్ఎండి రిజర్వాయర్ లోని గుంతలో ఈతకు దిగారు. గల్లంతైన యువకుడికి ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయాడు. గమనించిన తోటి స్నేహితులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. జాలరుల సహాయంతో గల్లంతైన యువకుడి డెడ్ బాడీని బయటకు తీసి పోస్ట్ మార్టం కోసం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు . ఈ ఘటన పై ఎల్ఎండి ఎస్ఐ శీలం ప్రమోద్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.