Aug 24, 2022, 11:37 AM IST
హైదరాబాద్ : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే బిజెపి అదిష్టానం ఆయనపై సస్పెన్షన్ వేటు వేసినప్పటికి హైదరాబాద్ పాతబస్తీలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. మంగళవారం రాత్రి పాతబస్తీలోని చారిత్రక కట్టడం చార్మినార్ వద్ద భారీగా గుమిగూడిన ముస్లిం ప్రజలు రాజాసింగ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. ఆగ్రహంతో ఊగిపోయిన యువకులు పోలీస్ వాహనాలను ధ్వంసం చేసారు. దీంతో పరిస్థితి చేయిదాటుతుండటంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. ఇవాళ (బుధవారం) తెల్లవారుజామున మరోసారి పాతబస్తీలో ఆందోళనకు కొనసాగాయి. రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగిన ఓ వర్గం యువకులు రాజాసింగ్ ను ఉరితీయాలంటూ నినాదాలు చేసారు. దీంతో పాతబస్తీ నుండి గోషామహల్ వెళ్లే దారుల్లో పోలీసులు భారీ భద్రత ఏర్పాటుచేసారు. ఈ ఆందోళనలతో పాతబస్తీలో ఏ క్షణం ఏం జరుగుతుందోనని ప్రజలు భయపడుతున్నారు.