ఘట్కేసర్ కిడ్నాప్, రేప్ కట్టుకథ: ఆటో డ్రైవర్ మీద యువతికి కక్ష

Feb 13, 2021, 4:23 PM IST

ఘట్ కేసర్ యువతిపై అసలు అత్యాచారమే జరగలేదని రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ స్పష్టం చేశారు. విద్యార్థిని కిడ్నాప్ అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిందని చెప్పారు. దుస్తులు చిరిగిపోయిన స్థితిలో కనిపించిన విద్యార్థిని తనపై ఆటోడ్రైవర్లు అత్యాచారానికి పాల్పడ్డారని  చెప్పింది.

ఈ కేసులో అసలు విషయాన్ని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ మీడియాకు వెల్లడించారు.  అసలు ఆ అమ్మాయిపై అత్యాచారం జరగలేదని వెల్లడించారు. కుటుంబ సమస్యలతో ఇంటి నుంచి వెళ్లిపోవాలని భావించిన యువతి, తల్లి అదేపనిగా ఫోన్ చేస్తుండడంతో అబద్ధం ఆడిందని, పోలీసులను తప్పుదోవ పట్టించిందని తెలిపారు. అత్యాచార ఘటన ఆ అమ్మాయి అల్లిన కట్టుకథ అని వివరించారు. పైగా ఇందులో ఆటోడ్రైవర్ పై కక్ష కోణం కూడా ఉందని పేర్కొన్నారు.

"ఆ అమ్మాయి రాంపల్లి ఆర్ఎల్ నగర్ కు చెందిన బీఫార్మసీ విద్యార్థిని. ఈ నెల 10వ తేదీ సాయంత్రం డయల్ 100 నెంబరుకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. 5.30 గంటలకు రాంపల్లి బస్టాప్ వద్ద కాలేజీ బస్సు దిగిన విద్యార్థిని ఓ ఆటోలో ఎక్కగా, ఆ ఆటోడ్రైవర్ ఎక్కడా ఆపకుండా తీసుకెళ్లిపోయాడంటూ మాకు ఫిర్యాదు అందింది" అని అన్నారు. 

"ఈ మేరకు యువతి తన తల్లికి చెప్పగా ఆమె మాకు ఫోన్ చేసింది. ఈ ఫోన్ కాల్ నేపథ్యంలో సమీప పోలీస్ స్టేషన్లను అప్రమత్తం చేశాం. వాహనాల తనిఖీ షురూ చేశాం. నిర్జన ప్రదేశాల్లోనూ గాలింపు జరిపాం. చివరికి 7.50 గంటలకు ఆ అమ్మాయి ఫోన్ నెంబరును ట్రాక్ చేయగలిగాం. లొకేషన్ ను ట్రేస్ చేయగా అన్నోజిగూడ వద్ద ఉన్నట్టు వెల్లడైంది. దాంతో పోలీసులు అక్కడికి వెళ్లేసరికి దుస్తులు చిందరవందరగా ఉన్న స్థితిలో ఆ అమ్మాయి కనిపించింది" అని ఆయన వివరించారు.. 

"అక్కడి నుంచి ఆమెను ఆసుపత్రికి తరలించాం. తనను ఆటోడ్రైవర్లు రేప్ చేశారని చెప్పింది. దాంతో ఆటోడ్రైవర్లను అదుపులోకి తీసుకుని ప్రశ్నించాం. శాస్త్రీయకోణంలో దర్యాప్తు చేయగా ఆటోడ్రైవర్లు ఎలాంటి తప్పు చేయలేదని తేలింది. సీసీటీవీ ఫుటేజిలో కూడా ఆ అమ్మాయి పలు ప్రాంతాల్లో ఒంటరిగానే సంచరించినట్టు వెల్లడైంది" అని అన్నారు. 

"కేసు రీ కన్ స్ట్రక్షన్ లో ఆ అమ్మాయి అబద్దాలు చెప్పిన విషయం తేటతెల్లమైంది. వాస్తవ పరిస్థితులకు, ఆ విద్యార్థిని చెబుతున్న విషయాలకు ఎక్కడా పొంతన కుదరలేదు. దాంతో ఆ అమ్మాయిని ప్రశ్నిస్తే అసలు విషయం చెప్పింది. కుటుంబ సమస్యలు ఉన్నాయని, అందుకే ఇంటి నుంచి వెళ్లిపోవాలనుకున్నానని వెల్లడించింది" చెప్పారు. 

"గతంలో ఓ ఆటో డ్రైవర్ పై ఉన్న కోపాన్ని ఇప్పుడు ఉపయోగించుకుంది. తనను కిడ్నాప్ చేశాడని తల్లికి చెప్పింది. దాంతో అది నిజమే అని నమ్మిన ఆ విద్యార్థిని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది" అని సీపీ మహేశ్ భగవత్ వివరించారు