బాత్రూంల కోసం కొందరు, టీచర్ల కోసం మరికొందరు... తెలంగాణలో విద్యార్థుల పరిస్థితి ఇదీ

Dec 22, 2022, 2:10 PM IST

పెద్దపల్లి : కాలం గడుస్తూనే వుంది... రాష్ట్రాలు, ప్రభుత్వాలు మారుతూన్నాయి... కానీ ప్రభుత్వ హాస్పిటల్స్, పాఠశాలల తీరు మాత్రం మారడంలేదు. నిరుపేదలకు సేవలందించాల్సిన ఈ రెండిట్లో పరిస్థితి ఎక్కడవేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా వుంది. ఇలా తెలంగాణలో స్కూళ్ల పరిస్థితి కూడా అధ్వాన్నంగా వుంది. ఇటీవల తమ కాలేజీలో బాత్రూంలు లేకపోవడంతో ఎక్కడ టాయిలెట్ వస్తుందోనని నీళ్లు కూడా తాగడంలేదంటూ అమ్మాయిలు చెప్పడం అందరినీ కలచివేసింది. వెంటనే తమ సమస్యను పరిష్కరించాలంటూ బాత్రూంల కోసం అమ్మాయిలు రోడ్డెక్కి ఆందోళనకు దిగడం సంచలనంగా మారింది. ఈ ఘటన మరువక ముందే పెద్డపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం మొట్లపల్లి ప్రాథమిక పాఠశాలలో ఐదు తరగతులకు ఒకే ఉపాధ్యాయుడు వుండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఒకే గదిలో కొనసాగుతోంది... ఒకే ఉపాధ్యాయుడు అందరినీ చూసుకుంటూ పాఠాలు చెప్పాల్సి వస్తోంది. దీంతో పాఠాలేవీ అర్థం కావడంలేదని విద్యార్థులు అంటున్నారు. తమ సమస్యను వివరించిన విద్యార్థులు సరిపడా టీచర్లను నియమించాలని స్వయంగా కోరడం ప్రభుత్వ పాఠశాలల్లో పరిస్థితిని తెలియజేస్తోంది.