Sep 27, 2022, 1:48 PM IST
కరీంనగర్ : ఈ కంప్యూటర్ యుగంలోనూ కొన్ని మారుమూల గ్రామాల ప్రజల అమాయకత్వంతో మంత్రగాళ్లు పుట్టుకొస్తున్నారు. ప్రజల భయమే పెట్టుబడిగా మంత్రాలు, క్షుద్రపూజల పేరిట లక్షలు దండుకుంటున్నారు. ఇలా హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలో క్షుద్రపూజలు చేస్తూ మంత్రగాళ్ళు రెచ్చిపోతున్నారు. ఇటీవల హుజురాబాద్ శివారులోని రంగనాయక గుట్టలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. గుప్తనిధుల కోసం గుర్తుతెలియని దుండగులు గుట్టపై క్షుద్రపూజలు చేసి తవ్వకాలు చేపట్టారు. ఉదయం గుట్టపై నిమ్మకాయలు, కొబ్బరికాయలు, బలిచ్చిన కోళ్లు, మేకలు, పందులను చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇదే హుజురాబాద్ పరిధిలోని మరో గ్రామంలో ప్రజలు మూడనమ్మకంతో ఓ రోజంతా ఇళ్లకు దూరంగా వున్నారు. జమ్మికుంట మండలం రామన్నపల్లెలో గ్రామంలో ఆరుగురు మృతిచెందారు. దీంతో ఊరికేదో కీడు సోకిందని భావించిన గ్రామస్తులు మొత్తం ఓ రోజంతా ఇళ్లకు తాళం వేసి ఊరిబయట గడిపారు. అక్కడే వంటావార్పు చేసుకుని రోజంతా అక్కడే వున్నారు.