Oct 17, 2022, 10:25 AM IST
మునుగోడు : ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు మునుగోడు ఉపఎన్నికల చుట్టూ తిరుగుతున్నాయి. అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బిజెపి, కాంగ్రెస్ పోటీపోటీగా వ్యూహప్రతివ్యూహాలతో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. ఈ క్రమంలోనే గ్రామాల్లోని రెండో, మూడో స్థాయి నాయకులు, కార్యకర్తలను కూడా పార్టీలో జాయిన్ చేసుకునేందుకు అన్నిపార్టీలు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాయి. ఇలా తాజాగా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తంగడపల్లి గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఈటల రాజేందర్ సమక్షంలో బిజెపిలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి బిజెపిలోకి ఆహ్వానించారు ఈటల.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఈటల బిజెపిలో చేరికలపై కీలక వ్యాఖ్యలు చేసారు. చాలా మంది టీఆర్ఎస్ నాయకులు బిజెపిలో చేరడానికి రెడిగా వున్నారని... కేసీఆర్ యాటిట్యూడ్ నచ్చక, ఆయనపై విశ్వాసం సన్నగిల్లిన వారు చాలామంది బయటకు వచ్చేందుకు సిద్దమయ్యారన్నారు. ఇప్పటికే మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ బిజెపిలో చేరడానికి సిద్దమవగా... చాలామంది ఇంకా టచ్ లో వున్నారన్నారు. కర్నె ప్రభాకరా, ఎంపీనా, ఎమ్మెల్యేనా చెప్పను... కానీ సమయం వచ్చినపుడు బిజెపిలో చేరడానికి చాలామంది సిద్దంగా వున్నారన్నారు. రాజకీయ నాయకులకు భవిష్యత్ పై భరోసా బిజెపితోనే దక్కుతుందని ఈటల అన్నారు.