Oct 14, 2022, 2:07 PM IST
మునుగోడు : తెలంగాణ భవిష్యత్ రాజకీయాలను మునుగోడు ఉపఎన్నిక పలితం ప్రభావితం చేసే అవకాశాలుండటంతో ప్రధాన పార్టీలన్నీ ఇక్కడే తిష్టవేసాయి. అన్నిపార్టీల నాయకులు, కార్యకర్తలు ఇప్పటికే ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు. ఇలా ఇప్పటికే మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కీలక నాయకులు మునుగోడులో తమకు కేటాయించిన ప్రాంతాల్లో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రజలకు దగ్గరయ్యేందుకు నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఇలా మంత్రి ఆలోళ్ల ఇంద్రకరణ్ రెడ్డి గరిటె పట్టి స్వయంగా వంటచేసారు.
మునుగోడు ఉపఎన్నికలో ప్రచారం కోసం నిర్మల్ కు చెందిన టీఆర్ఎస్ నాయకులను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి రంగంలోకి దింపారు. వీరికి సర్వేల్ గ్రామంలోని ఓ ఇంట్లో విడిది ఏర్పాటుచేసారు. ఈ ఇంటిని పరిశీలించిన మంత్రి వంటగదిలోకి వెళ్ళి కాస్సేపు గరిటె పట్టారు. అనంతరం చపాతీలు చేయడంలోనూ సహకరించారు. ఇలా వంటచేస్తూ తాను ఎంపీగా డిల్లీలో వున్న రోజులను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గుర్తుచేసుకున్నారు.