May 25, 2021, 6:37 PM IST
అతడో ఉన్నత విద్యావంతుడు. గౌరవప్రదమైన లెక్ఛరర్ జాబ్ చేసేవాడు. అయితే నెల జీతం తీసుకుంటూ బ్రతకడం ఇష్టంలేని అతడు ఈజీ మనీ కోసం నేరాల బాట పట్టాడు. పడమూడేళ్లు పోలీసులకు దొరక్కుండా అజ్ఞాత జీవితం గడిపిన ఈ కరుడుగట్టిన నేరస్తుడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు.
నిజామాబాద్ పట్టణానికి చెందిన కుందన శ్రీనివాస రావు మెకానికల్ ఇంజినీరింగ్ చదివి లెక్చరర్ గా పనిచేసేవాడు. అయితే ఈజీ మనీ కోసం నకిలీ కిసాన్ వికాస్ పత్రాలను సృష్టించి అనేక బ్యాంకులను బురిడీ కొట్టించాడు. కోటిరూపాయలకు పైగా బ్యాంకులని మోసం చేసి జైలులో శిక్షను అనుభవించాడు. జైలు నుంచి బయటికి వచ్చాక కూడా నకిలీ పేర్లతో కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ తో పాటు గుంటూరులో , నకిలీ ఆధార్ కార్డులతో,నకిలీ పాన్ కార్డులతో మోసాలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్నాడు. 40కి పైగా నాన్ బెయిలబుల్ కేసులు నమోదవడం తో అజ్ఞాతం లోకి వెళ్ళిపోయాడు. పడమూడేళ్లు పోలీసులకు దొరక్కుండా అజ్ఞాత జీవితం గడిపిన శ్రీనివాస్ రావును కరీంనగర్ పోలీసులు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. ఒక్క కరీంనగర్ జిల్లాలో శ్రీనివాస రావుపై 23 కేసులున్నాయని సీపీ కమలాసన్ రెడ్డి వెల్లడించారు.