Sep 1, 2022, 4:55 PM IST
నిజామాబాద్ : బిజెపి నాయకులు నోటికి వచ్చినట్లు మొరగడం ఆపాలని... నిజంగానే వారికి దమ్ముంటే తెలంగాణలో ఇస్తున్నట్లుగా భారీ నగదుతో కూడిని పెన్షన్లు వారి పాలిత రాష్ట్రాల్లో ఇచ్చి తొడకొట్టాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సవాల్ విసిరారు. అలాకాకుండా మొక్కుబడిగా 600, 700 రూపాయల పెన్షన్ ఇస్తూ ఉచితాలు వద్దంటూ ప్రగల్భాలు పలకడం ఆపాలని సూచించారు. ఇచ్చిన మాట మేరకు ఎన్ని ఇబ్బందులున్నా కొత్త పెన్షన్లు మంజూరు చేసిన గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్ అంటూ మంత్రి వేముల కొనియాడారు.
నిజామాబాద్ లో కొత్త పెన్షన్లు మంజూరయిన వారికి లబ్ధిదారులకు స్థానిక ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాతో కలిసి పెన్షన్ కార్డులు అందజేసారు మంత్రి వేముల. ఈ సందర్భంగా లబ్దిదారులతో కలిసి మంత్రి, ఎమ్మెల్యే, ఇతర టీఆర్ఎస్ నాయకులు సహపంక్తి భోజనం చేసారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ... బిజెపి, కాంగ్రెస్ నాయకులపై మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై బిజెపి, కాంగ్రెస్ నేతలు పనికిమాలిన ఆరోపణలు చేస్తున్నారు... ప్రజలు గమనించాలని మంత్రి వేముల సూచించారు.