మానుకొండూరులో దారుణం... బావిలోకి ట్రాక్టర్ దూసుకెళ్లి ఒకరు మృతి

Jul 8, 2022, 4:44 PM IST

కరీంనగర్ : టీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన దళితబంధుతో అతడు ట్రాక్టర్ కొనుక్కున్నాడు. ట్రాక్టర్ రాకతో తమ జీవితం మారుతుందని భావిస్తే అదే అతడి ప్రాణాలను బలితీసుకుంది. డ్రైవర్ ను పక్కనే  కూర్చోబెట్టుకుని డ్రైవింగ్ నేర్చుకుంటుండగా ఒక్కసారిగా ట్రాక్టర్ అదుపుతప్పి బావిలోకి దూసుకెళ్లింది. దీంతో ట్రాక్టర్ యజమాని మృతిచెందాడు. ఈ దుర్ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. మానుకొండూరు మండలం బంజేరుపల్లి గ్రామానికి చెందిన కాంపల్లి శంకర్ ఇటీవలే దళితబంధు కింద ట్రాక్టర్ తీసుకున్నాడు. ట్రాక్టర్ నడపడానికి ఓ డ్రైవర్ ను పెట్టుకున్నప్పటికీ అప్పుడప్పుడు శంకర్ కూడా డ్రైవింగ్ నేర్చుకోడానికి నడిపేవాడు. ఈ క్రమంలోనే గురువారం సాయంత్రం శంకర్ ఓ పొలం దున్నడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే ట్రాక్టర్ అదుపుతప్పి బావిలోకి దూసుకెళ్లింది. దీంతో శంకర్ అక్కడిక్కడే మృతిచెందాడు. దాదాపు 22గంటలపాటు పోలీసులు, స్థానికులు శ్రమించి ట్రాక్టర్ ను, శంకర్ మృతదేహాన్ని బావిలోంచి బయటకు తీసారు.