Sep 28, 2019, 8:23 PM IST
బతుకమ్మ తయారీ ఓ కళ. పువ్వుమీద పువ్వు పెట్టి గుండ్రంగా, గోపురంలా పేర్చడం అందరికీ ఒంటపట్టే విద్య కాదు. తంగేడు, గునుగు, కట్ల, బంతి, పట్టుకుచ్చులు, చామంతులు దొంతరలు దొంతరలుగా పేర్చుకుంటూ వెళ్లడం చూడముచ్చటైన వేడుక.
పెత్తరామాస రోజు ఉదయం పెద్దలకు నైవేద్యం పెట్టిన తరువాత బతుకమ్మ పేర్చడం ప్రారంభిస్తారు. మధ్యాహ్నానికి బతుకమ్మను పేర్చి దేవుడిదగ్గర పెట్టేసి..ఆ తరువాత భోజనాలు చేసి సాయంత్రం, ఇరుగూపొరుగుతో కలిసి బతుకమ్మను ఆడుకుంటారు.
అమావాస్యతో మొదలయ్యే బతుకమ్మ పండుగ సద్దుల బతుకమ్మ వరకు తొమ్మిదిరోజులు ఆడతారు. తొమ్మిది రోజులు తొమ్మిది పేర్లతో పిలుస్తారు. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ, రెండోరోజు అటుకుల బతుకమ్మ, మూడోరోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ, ఐదోరోజు అట్ల బతుకమ్మ, ఆరో రోజు అలిగిన బతుకమ్మ ఈ రోజు బతుకమ్మను ఆడరు. ఏడో రోజు వేపకాయ బతుకమ్మ, ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మ, చివరి రోజు సద్దుల బతుకమ్మ. పెత్తరమాసనాడు పేర్చే బతుకమ్మ సోయగం ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూసేయండి.