Aug 26, 2022, 10:41 AM IST
సిరిసిల్ల : నిత్యం మద్యంమత్తులో తల్లీ, చెల్లిని చితబాదిన తాగుబోతు తండ్రి చేష్టలతో ఆ బాలుడు విసిగిపోయాడు. కసాయి తండ్రి తల్లి, చెల్లిని చిత్రహింసలకు గురిచేస్తుండటంతో తల్లడిల్లిపోయిన ఆ బాలుడు పోలీసులను ఆశ్రయించాడు. ఇలా చిన్నారి బాలుడు తాగుబోతు తండ్రికి బుద్దిచెప్పడానికి పోలీసులకు ఫిర్యాదు చేసాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. ముస్తాబాద్ కు చెందిన జంగం భరత్ అంబేద్కర్ నగర్ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. ఇతడి తండ్రి బాలకృష్ణ మద్యానికి బానిసై కుటుంబ పోషణను మరిచాడు. అంతేకాదు నిత్యం మద్యంమత్తులో ఇంటికి వచ్చి తల్లీ దీపికతో పాటు చెల్లిని కూడా చితబాదేవాడు. ఇది చూసి తట్టుకోలేక అడ్డుకుంటే భరత్ ను కూడా కొట్టేవాడట. ఇలా నిత్యం మద్యానికి డబ్బుల కోసం భార్యాబిడ్డలను వేధించేవాడు బాలకృష్ణ. తాగుబోతు తండ్రి వేధింపులతో విసిగిపోయిన బాలుడు పోలీసులను ఆశ్రయించాడు. బాలుడి నుండి వివరాల సేకరించి అతడి తాగుబోతు తండ్రిని పోలీస్ స్టేషన్ కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు ముస్తాబాద్ పోలీసులు. తల్లీ, చెల్లిపై ప్రేమతో బాలుడు ధైర్యంగా పోలీస్ స్టేషన్ మెట్లెక్కడంపై స్థానికులు అభినందిస్తున్నారు.