జగిత్యాలలో వింత స్కూల్... బ్లాక్ బోర్డ్ ముందు కాదు భగవంతుడి ముందే పాఠాలు

Jul 19, 2022, 11:33 AM IST

జగిత్యాల : చిన్నారులు విద్యాబుద్దులు నేర్చుకునే బడి గుడి లాంటిదే అని అంటుంటారు. కానీ జగిత్యాల జిల్లాలో ఏకంగా గుడే బడిలా మారిపోయింది. బడి గంటలు, ఉపాధ్యాయుల పాఠాలు, బ్లాక్ బోర్డ్ ముందు సాగాల్సిన పాఠశాల గుడిగంటలు, పూజారి మంత్రోచ్చరణలతో ఆ అభయాంజనేయుని ముందు సాగుతోంది. ఈ పరిస్థితి జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో చోటుచేసుకుంది. 

రాయికల్ లోని శ్రీరాంనగర్ లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనం పరిస్థితి అధ్వాన్నంగా తయారయ్యింది. దీనికి తోడు ఇటీవల కురుస్తున్న వర్షాలకు భవనంలోకి నీరు చేరడమే కాదు పెచ్చులూడుతున్నాయి. దీంతో ఈ పాఠశాలలో విద్యార్థులకు పాఠాలు బోధించలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఉపాధ్యాయులు పాఠశాల సమీపంలోని ఆంజనేయస్వామి ఆలయాన్ని ఆశ్రయించారు. దాదాపు 25 మంది విద్యార్థులకు గుడిలోనే పాఠాలు బోధిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నూతన పాఠశాల భవనాన్ని నిర్మించాలని ఉపాధ్యాయులు, రాయికల్ వాసులు కోరుతున్నారు.