Nov 14, 2022, 4:54 PM IST
హైదరాబాద్ : నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో వుండే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇవాళ నడిరోడ్డుపై ఆగాల్సి వచ్చింది. ప్రాణహాని వుందంటూ ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో రాజాసింగ్ కు టీఆర్ఎస్ ప్రభుత్వం బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించింది. అయితే ఇప్పటికే అనేకసార్లు వాహనం రోడ్డుపైనే ఆగిపోగా ఇవాళ మరోసారి అలాగే జరిగింది. రెండునెలలకు పైగా జైల్లో వున్న రాజాసింగ్ ఇటీవలే బెయిల్ పై బయటకు వచ్చారు. చాలారోజుల తర్వాత అతడు ఇవాళ బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో బయటకువెళ్లగా పాతబస్తీ ప్రాంతంలో నడిరోడ్డుపైనే ఆగిపోయింది. దీంతో మరో సాధారణ వాహనంలో రాజాసింగ్ అక్కడినుండి వెళ్లిపోవాల్సి వచ్చింది. తనకు ప్రాణహాని వుందని తెలిసినా ప్రభుత్వం కాలంచెల్లిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించిందంటూ రాజాసింగ్ అసహనం వ్యక్తం చేసారు. తన వాహనాన్ని మార్చాలని ఇంటెలిజెన్స్ ఐజీని ఎన్నిసార్లు కోరినా పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే తెలిపారు. ఇప్పటికయినా ప్రభుత్వం స్పందించి తనకు మంచి వాహనాన్ని కేటాయించాలని రాజాసింగ్ కోరారు.