పంటను కాపాడుకుందామంటే ప్రాణాలే బలి...: పొలంగట్టుపైనే రైతు దంపతుల దుర్మరణం

Oct 19, 2022, 12:17 PM IST

కరీంనగర్ : ఆరుగాలాలు కష్టపడి పండించిన పంటను కాపాడుకునే క్రమంలో రైతు దంపతుల ప్రాణాలే బలయ్యాయి. పొలానికి మందుకొడుతూ తెగిపడిన విద్యుత్ తీగలను తాకి భర్త, అతడిని కాపాడబోయి భార్య విద్యుత్ షాక్ కు గురయ్యారు. ఇలా ఇంతకాలం మట్టిని నమ్ముకుని బ్రతికిన దంపతులు అదే మట్టిలో కలిసిపోయి ఇద్దరు ఆడబిడ్డలను అనాధలను చేసారు. ఈ హృదయవిదారక ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. చొప్పదండి మండలం వెదురుగట్ట గ్రామంలో ఎలిగేడు మండలం సుల్తాన్ పూర్ గ్రామానికి చెందిన జాతరగొండ ఓదేలు(42) కు వ్యవసాయ పొలం వుంది. పంటను చీడపీడల నుండి కాపాడుకునేందుకు ఓదేలు భార్య రజిత(35) తో కలిసి మందు కొడుతుండగా ప్రమాదం జరిగింది. గాలికి విద్యుత్ తీగలు తెగి పొలంలో పడగా అది గమనించని ఓదేలు కరెంట్ షాక్ కు గురయ్యాడు. షాక్ తో విలవిల్లాడుతున్న భర్తను కాపాడుకునేందుకు ప్రయత్నించిన రజిత కూడా షాక్ కు గురయ్యింది. ఇలా భార్యాభర్తలిద్దరు కరెంట్ షాక్ తో పొలంలోనే మృతిచెందారు. ఇలా ఒకేసారి తల్లిదండ్రుల మృతితో అనాధలుగా మారిన ఇద్దరు ఆడబిడ్డలు మృతదేహాల వద్ద రోదించడం అందరినీ కన్నీరు పెట్టించింది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే భార్యాభర్తలు ప్రాణాలు కోల్పోయారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.