వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో శిశువు మృతి... కొడుకు మృతదేహంతో తండ్రి ఆందోళన

Oct 17, 2022, 4:09 PM IST

పెద్దపల్లి : తెలంగాణలో ప్రభుత్వాసుపత్రుల్లో సదుపాయాలు కాస్త మెరుగుపడినా వైద్యసిబ్బంది తీరులో మాత్రం ఏమాత్రం మార్పులేదు. అదే నిర్లక్ష్యాన్ని కొనసాగిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇలా వైద్యసిబ్బంది వల్లే తమ బిడ్డ చనిపోయాడంటూ అప్పుడే పుట్టిన పసిగుడ్డు మృతదేహంతో హాస్పిటల్ ముందే తండ్రి, కుటుంబసభ్యులు ఆందోళనకు దిగిన ఘటన పెద్దపెల్లి జిల్లాలో చోటుచేసుకుంది. 

పెద్దపల్లి మండలం పాలితం గ్రామానికి చెందిన దివ్య నిండు గర్భంతో ప్రసవం కోసం రెండు రోజుల క్రితం జిల్లా ప్రభుత్వాస్పత్రిలో చేరింది. ఈ రెండ్రోజులు అక్కడే వుంచుకుని తీరా ఆపరేషన్ చేసే సమయానికి వైద్యనిపుణులు లేరంటూ సిబ్బంది చేతులెత్తేసారు. దీంతో చేసేదేమిలేక కుటుంబసభ్యులు దివ్యను హుటాహుటిన కరీంనగర్ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే చాలా ఆలస్యం కావడంతో మగబిడ్డ పుట్టి మృతిచెందాడు. దీంతో నవజాత శిశువు మృతదేహంతో పెద్దపల్లి ప్రభుత్వాస్పత్రి వద్దకు చేరుకున్న దివ్య భర్త పవన్, కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. బాలుడి మృతిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.