Aug 21, 2022, 2:30 PM IST
హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ సర్కార్ కు బిజెపి ధీటుగా జవాబిస్తోంది. కేసీఆర్ సర్కార్ కు కౌంట్ డౌన్ స్టార్టయ్యిందంటూ హైదరాబాద్ లోని బిజెపి రాష్ట్ర కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన డిజిటల్ బోర్డు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ బోర్డును ఏర్పాటుచేసినందుకు జిహెచ్ఎంసి అధికారులు బిజెపికి రూ.50వేల జరిమానా విధించారు. అయినప్పటికి బిజెపి నాయకత్వం ఏమాత్రం వెనక్కి తగ్గడంలేదు. తాజాగా మళ్లీ సాలు దొర - సెలవు దొర క్యాప్షన్ తో టీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయంటూ కౌంట్ డౌన్ టైమ్ సూచించే డిజిటల్ బోర్డును పునరుద్దరించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్న నేపథ్యంలో టీఆర్ఎస్, బిజెపిల మధ్య ప్లెక్సీ వార్ మొదలవగా మళ్లీ ఈ డిజిటల్ బోర్డ్ నాంపల్లి కార్యాలయంవద్ద కనిపించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.