Jun 16, 2022, 2:01 PM IST
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీని విచారణ పేరుతో ఈడీ వేధించడాన్ని నిరసిస్తూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. పార్టీ పిలుపుమేరకు రాజ్ భవన్ ముట్టడికి సిద్దమైన కాంగ్రెస్ శ్రేణులు భారీగా ఖైరతాబాద్ చౌరస్తా వద్దకు చేరుకుని వాహనాలను అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే కొందరు కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వాహనాలను ధ్వంసం చేసారు. నడిరోడ్డుపై ఓ స్కూటీని అడ్డుకుని పెట్రోల్ పోసి నిప్పంటించారు. అలాగే ఆర్టిసి బస్సులను కూడా ధ్వంసం చేసారు. రోడ్డుపై పాతటైర్లు వేసి నిప్పంటించి వాహనాలను అడ్డుకున్నారు. కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు రాజ్ భవన్ వైపు చొచ్చుకుని వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు కాంగ్రెస్ శ్రేణులను అరెస్ట్ చేసారు.