Oct 17, 2022, 2:06 PM IST
నల్గొండ : మునుగోడు ఉపఎన్నిక ఫలితం భవిష్యత్ రాజకీయాలను ప్రభావితం చేసే అవకాశాలుండటంతో అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బిజెపి, కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే మునుగోడులో తిష్టవేసిన పార్టీల నాయకులు, కార్యకర్తలు ప్రచారాన్ని ముమ్మరం చేసాయి. ఇక అభ్యర్ధుల ప్రచారం అయితే తారాస్థాయికి చేరింది. ఇలా బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంస్థాన్ నారాయణపురం మండలం కొత్తగూడెం గ్రామంలో చేపట్టిన ప్రచారాన్ని కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేసారు. దీంతో వారిపై కోమటిరెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసారు.
బిజెపి ప్రచారాన్ని అడ్డుకున్న కాంగ్రెస్ నాయకులను కోమటిరెడ్డి బెదిరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ''ఒరేయ్...నీ పేరేంటి... నీ సంగతి చూసుకుంటా...'' అంటూ బెదిరిస్తూ ''తన్నుండ్రి నా కొడుకును తన్నుండ్రి...'' అంటూ బిజెపి శ్రేణులను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రెచ్చగొట్టారు. దీంతో తమపైకి వచ్చిన బిజెపి నాయకులు దాడికి యత్నించారని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.