Jul 7, 2022, 3:49 PM IST
కరీంనగర్ : శాతవాహన యూనివర్సిటీలో అటవీ జంతువులు కలకలం రేపుతున్నాయి. ఇటీవల కాలేజీ నుండి హాస్టల్ కు వెళుతున్న విద్యార్థినిని పాము కాటేసిన ఘటన మరువకముందే క్యాంపస్ లో ఎలుగుబంటి కలకలం సృష్టిస్తోంది. కరీంనగర్ పట్టణ శివారులోని శాతవాహన క్యాంపస్ లో ఎలుగుబంటిని గమనించిన స్థానికులు అటవీ అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో యూనివర్సిటీ హాస్టల్లో వుండే విద్యార్థులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో నివాసముండే ప్రజల్లో భయాందోళన నెలకొంది. శాతవాహన యూనివర్సిటీ సమీపంలోని మల్కాపూర్ రోడ్ లో గల ఓ ఇంటి ఆవరణలోకి రాత్రి ఎలుగుబంటి ప్రవేశించింది. దీన్ని చూసి భయపడిపోయిన ఆ ఇంటివారు గట్టిగా కేకలు వేయడంతో ఎలుగుబంటి గోడదూకి మార్క్ ఫెడ్ గ్రౌండ్ వైపు పరుగు తీసింది. ఎలుగుబంటి సంచారంపై సమాచారం అందుకున్న అటవీ అధికారులు దాన్ని పట్టుకునే ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదు. ఎలుగుబంటి యూనివర్సిటీ క్యాంపస్ లోని దట్టంగా వున్న చెట్లల్లోకి వెళ్లినట్లు అటవీ అధికారులు గుర్తించారు. దీంతో క్యాంపస్ హాస్టల్లలో వుండే విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు.