Jul 5, 2022, 4:28 PM IST
భారత స్వాతంత్య్రం కోసం స్వదేశంలోనే కాకుడా విదేశాల్లో కూడా ఉద్యమాలు నడిపిన స్వాతంత్య్ర సమరయోధులు ఉన్నారు. విదేశాల్లో ఉంటూ భారతదేశ స్వేచ్ఛ కోసం జీవితాంతం పోరాటం సాగించిన ప్రసిద్ధ ప్రవాస భారతీయుల్లో శ్యామ్‌జీ కృష్ణ వర్మ ఒకరు. ఆర్యసమాజానికి చెందిన దయానంద సరస్వతి శిష్యుడు, సంస్కృత పండితుడైన వర్మ విప్లవ జాతీయవాదం వైపు మళ్లారు. స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రత్యేక పేజీని లిఖించారు. గుజరాత్‌లోని మాండ్విలో శ్యామ్‌జీ కృష్ణ వర్మ 1857లోజన్మించాడు. కాశీ విద్యా పీఠం నుండి పండిట్ బిరుదు పొందిన మొదటి బ్రాహ్మణేతర సంస్కృత పండితుడు కావడం విశేషం. 1879లో ప్రముఖ సంస్కృత ప్రొఫెసర్ మోనియర్ విల్లమ్స్ సహాయంతో వర్మ ఆక్స్‌ఫర్డ్‌లోని బల్లియోల్ కాలేజీలో చేరాడు. గ్రాడ్యుయేషన్ తర్వాత.. వర్మ భారత్ కు తిరిగివచ్చి.. జునాగఢ్ రాజా దివాన్ గా ప్రయాణం ప్రారంభించారు. కొంతకాలం తర్వాత వర్మ లండన్ తిరిగి వచ్చి ప్రఖ్యాత Inner Temple నుండి బారిస్టర్ అయ్యాడు. అప్పటికి వర్మ జాతీయోద్యమంలో కోసం పోరాటం సాగిస్తున్నారు. లండన్‌లో భారతీయ విద్యార్థుల కోసం ఇండియా హౌస్ పేరుతో హోటల్‌ను ఏర్పాటు చేశాడు. వసతి, ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్న భారతీయులకు అండగా నిలిచింది. ఇండియా హౌస్ తీవ్రవాద జాతీయవాద భారతీయ విద్యార్థుల కేంద్రంగా మారింది. VD సావర్కర్, భికాజీ కామా, లాలా హర్దయాల్, వీరేంద్రనాథ్ ఛటర్జీ మొదలైన సుప్రసిద్ధ జాతీయవాదులుగా మారారు. అయితే, ఇండియా హౌస్ రాడికల్స్‌లో ఒక వర్గం కమ్యూనిజం వైపు మళ్లగా, మరొకటి మిలిటెంట్ హిందూ రాజకీయాల వైపు ప్రయాణం సాగించింది. 1909లో ఇండియా హౌస్‌కు చెందిన విద్యార్థి విప్లవకారుడు మదన్‌లాల్ ధింగ్రా.. బ్రిటీష్ అధికారి సర్ విలియం వైలీని హత్య చేయడంతో.. బ్రిటిష్ పోలీసులు అరెస్టులు, దాడులు, అణచివేత చర్యలు ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఇండియన్ సోషియాలజిస్ట్ పత్రిక నిషేధించబడింది. దీంతో ఇండియా హౌప్ పై తీవ్ర ప్రభావం పడింది. అరెస్టయ్యే ముందు వర్మ పారిస్‌కు పారిపోయి జెనీవాకు వెళ్లారు. యూరోపియన్ దేశాలలో తన మిలిటెంట్ జాతీయవాద కార్యకలాపాలను కొనసాగించాడు. జాతీయవాద ప్రవాసుల ఇండియా ఇండిపెండెన్స్ లీగ్‌కు నాయకుడుగా ఎదిగాడు. వర్మ 1930లో జెనీవాలో చనిపోయే ముందు.. స్వేచ్చ పొందిన తర్వాతే తన చితాభస్మాన్ని భారతదేశానికి పంపాలని సెయింట్ జార్జ్ స్మశానవాటికలోని అధికారులను వర్మ కోరాడు. స్వాతంత్య్రం వచ్చిన 56 ఏండ్ల తర్వాత 2003లో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా వర్మ అస్థికలను స్వీకరించారు. 2010లో ఆయన స్వస్థలమైన మాండ్విలో నిర్మించిన క్రాంతి తీర్థం అనే పేరుగల వర్మ స్మారకం వద్ద దాన్ని ఉంచారు.