Jul 14, 2022, 12:32 PM IST
భారత స్వాతంత్య్ర పోరాటంలో ఎంతో మంది ప్రాణాలర్పించి భారత జాతికి విముక్తి కల్పించారు. ఆంగ్లేయుల తూటాలకు ఎదురునిలిచి ఎందరో అమరవీరులయ్యారు. 72 సంవత్సాలర వయస్సులో మాతృభూమి స్వేచ్ఛ కోసం బ్రిటిష్ వారితో పోరాటం సాగించి.. వారి తూటాలకు బలైన అమరవీరురాలు మాతాంగిని హజ్రా. ఆమె 1869లో తమ్లుక్ సమీపంలోని హోగ్లా అనే చిన్న గ్రామంలో జన్మించింది. స్వాతంత్య్ర ఉద్యమంవైపు ఆకర్షితురాలైన ఆమె శాసనోల్లంఘన ఉద్యమంతో బ్రిటిష్ వ్యతిరేక ప్రయాణం ప్రారంభించింది.
క్విట్ ఇండియా ఉద్యమం ఉధృతంగా కొనసాగుతున్న రోజులవి. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సాగుతున్న 6000 మందికి పైగా కాంగ్రెస్ కార్యకర్తలు మేదినీపూర్‌లోని పోలీస్ స్టేషన్‌కు వెళ్తున్న ర్యాలీకి ఆమె నాయకత్వం వహించారు. త్రివర్ణ పతాకాన్ని మోస్తూ పోరాటాన్ని ముందుకు నడిపారు. ఈ ప్రాంతం జాతీయవాదులచే స్వతంత్ర రాష్ట్రంగా ప్రకటించబడిన తమ్లుక్‌లో ఉంది. మార్చ్ సమీపించగానే బ్రిటిష్ పోలీసు అధికారి కవాతులను చెదరగొట్టడానికి కాల్పులు జరుపుతామంటూ హెచ్చరికలు చేశారు. అయిన వెనక్కితగ్గకుండా ముందుకు సాగారు. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకు కదిలారు. ముందుగా నన్ను కాల్చివేయండి అంటూ ప్రదర్శించిన ధీరత్వం ఎంతో మందిలో స్పూర్తిని.. స్వాతంత్య్ర కాంక్షను రగిల్చింది. జాతీయ జెండాను పట్టుకుని వందేమాతరం అంటూ ముందుకు సాగుతున్నారు. ఒక్కసారిగా బ్రిటిష్ వారు ఆమె గుండెలపై కాల్చారు. రక్తం కారుతున్న పట్టువదల కుండా వందేమాతరం.. గాంధీకి జై అంటూ నినాదాలు చేస్తూ కొంతదూరం ముందుకు సాగింది. మరో రెండు బుల్లెట్లు ఆమెను తాకడంతో రక్తపు మడుగులో పడి ప్రాణత్యాగం చేసిన ధీర వనితాగా చరిత్రలో నిలిచారు.
తమ్లూక్‌లోని హోగ్లాలో పేద రైతు కుటుంబంలో జన్మించిన మాతంగిని 12 సంవత్సరాల వయస్సులో వివాహం చేసుకుంది. 18 సంవత్సరాల వయస్సులో వితంతువు అయింది. గాంధీ పిలుపుతో ఆమె స్వాతంత్ర్య పోరాటంలోకి ప్రవేశించారు. 1930లలో ఉప్పు సత్యాగ్రహం, శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొన్న మాతంగిని అనేక సార్లు అరెస్టులు.. పోలీసు చిత్రహింసలను ఎదుర్కొన్నారు. 1977లో కోల్‌కతా నగరంలో మాతంగిని హజ్రా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.