Jun 26, 2022, 11:49 AM IST
భారత స్వాతంత్య్ర ఉద్యమంలో చోటుచేసుకున్న అనేక ఘటనలు నిస్సత్తువలో ఉన్న ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేశాయి. అలాంటి జాతీయోద్యమానికి పెద్ద పీట వేసిన చారిత్రాత్మక రైతాంగ పోరాటం బార్డోలీ సత్యాగ్రహం. చౌరీ చౌరా వద్ద జరిగిన హింసాత్మక సంఘటన తర్వాత గాంధీజీ శాసనోల్లంఘన ఉద్యమాన్ని ఉపసంహరించుకున్నారు. దీంతో అప్పటివరకు ఉధృతంగా కొనసాగుతున్న స్వాతంత్య్ర పోరాటం మందకొడిగా మారింది. అయితే, బార్డోలీ రైతుల కారణంగా మళ్లీ స్వాతంత్య్ర ఉద్యమం ఊపందుకుంది.గుజరాత్‌లోని సూరత్ ప్రాంతంలో బార్డోలీ ఒక రైతు గ్రామం. బ్రిటీష్ అధికారులు ఇక్కడ భూమి పన్నులను 30% పెంచారు. ఇది ఇప్పటికే వివిధ కష్టాలతో కొట్టుమిట్టాడుతున్న గ్రామస్తులను మరింత ఇబ్బందలకు దిగజార్చింది. ఆ సమయంతో అహ్మదాబాద్ మునిసిపల్ ప్రెసిడెంట్‌గా ఉన్న వల్లభాయ్ పటేల్ రైతుల దుస్థితిని తెలుసుకుని బార్డోలీకి వచ్చి రైతులను సమీకరించారు. గాంధీ మద్దతుతో, పటేల్ రైతులను పన్నులు చెల్లించవద్దని కోరుతూ.. సత్యాగ్రహం ప్రారంభించాడు. పన్ను తగ్గించాలని పటేల్ చేసిన అభ్యర్థనను బొంబాయి గవర్నర్ పట్టించుకోలేదు. బదులుగా, అతను ఆందోళన చేస్తున్న రైతులపై అనేక అణచివేత చర్యలను ప్రారంభించాడు.ఈ క్రమంలోనే క్రూరమైన దాడులు, పెద్ద ఎత్తున అరెస్టులు, భూముల నుండి బలవంతంగా రైతులను ఖాళీ చేయించడం, స్వాధీనం చేసుకున్న భూములను వేలం వేయడానికి ప్రయత్నాలు జరిగాయి. కానీ పటేల్ నేతృత్వంలోని రైతులు లొంగిపోకుండా ముందుకు సాగారు. ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. దీంతో చేసేదేమిలేక బ్రిటీష్ సర్కారు పన్ను పెంపును పరిశీలించడానికి మాక్స్‌వెల్ బ్రూమ్‌ఫీల్డ్ ఆధ్వర్యంలో ఒక స్వతంత్ర ట్రిబ్యునల్‌ని నియమించింది. పన్ను పెంపును రద్దు చేయాలని కమిషన్ పేర్కొంది. రైతులు సాధించిన ఈ విజయంతో దీనిని నాయకత్వం వహించి.. మందుకు నడిపిన వల్లభాయ్ పటేల్ ను తొలిసారిగా సర్ధార్ అంటూ సంభోదించారు. సర్ధార్ అంటే నాయకుడు అని అర్థం. రైతులు సాధించిన ఈ విజయం స్వాతంత్య్ర ఉద్యమానికి కొత్త శక్తినిచ్చింది. భారత స్వాతంత్య్ర ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లింది.