Jul 4, 2022, 2:36 PM IST
గెరిల్లా వ్యూహాలతో బ్రిటీష్ సైన్యానికి ముచ్చెమటలు పట్టించిన ఖాసీ గిరిజన తెగ..
బ్రిటీష్ పాలకవర్గానికి ఎదురునిలిచి, వారి సైన్యాన్ని గడగడలాడించిన ఘన చరిత్ర భారతదేశ మూల వాసులకు ఉంది. కేవలం విల్లులు, కత్తులు బాణాలతో ఆధునిక ఆయుధాలు కలిగి ఉన్న బ్రిటీష్ సేనకు ముచ్చెమటలు పట్టించిన ఖ్యాతి ఖాసీ గిరిజన తెగకు దక్కుతుంది. 19 వ శతాబ్దం ప్రారంభంలో మయన్మార్ ను (బర్మా ) జయించిన తరువాత బ్రిటిష్ వారి కళ్లు ప్రస్తుత మేఘాలయలోని ఖాసీ కొండలపై పడ్డాయి. దీనిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించిన సమయంలో అక్కడ నివసించే ఖాసీ గిరిజన తెగ దీనిని అడ్డుకుంది. పోరాటం చేసింది. ఈ ప్రతిఘటనకు తిరోత్ సింగ్ నాయకత్వం వహించారు.
స్థానిక పాలకుల మధ్య విభేదాలను తమకు అనుకూలంగా ఉపయోగించుకోవడం, తమ సొంత ఎజెండాను అమలు చేయడం బ్రిటిష్ వారి సాధారణ వ్యూహం. కానీ బ్రిటిష్ ఏజెంట్ డేవిడ్ స్కాట్ చేసిన ఇలాంటి ఈ ప్రయత్నాలను తిరోత్ సింగ్ బహిర్గతం చేశారు. ఆయన ఆధ్వర్యంలో 1829 ఏప్రిల్ 4వ తేదీన ఖాసీ గిరిగిన తెగకు బ్రిటీష్ దండుపై దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు బ్రిటిష్ అధికారులు మరణించారు. ఇది బ్రిటిష్ వారి భీకరమైన ప్రతీకార దాడికి దారితీసింది. ఇదే ఆంగ్లో-ఖాసీ యుద్ధానికి నాంది అయ్యింది.
కత్తులు, విల్లులు, బాణాలు మాత్రమే ఉన్న ఖాసీలకు, తుపాకులు, ఇతర ఆధునిక ఆయుధాలు ఉన్న బ్రిటీష్ సేనకు మధ్య యుద్ధం జరిగింది. ఆధునిక ఆయుధాలు లేకున్నా ఖాసీల భీకరమైన సంకల్పబలం, గెరిల్లా వ్యూహాలు, అడవులు, కొండల క్లిష్టమైన భూభాగంపై వారికి లోతైన అవగాహన వల్ల వారు బ్రిటీష్ సేనపై ఆకస్మికంగా దాడులు చేసేవారు. ఇలా ఈ యుద్ధం నాలుగేళ్ల పాటు వారికి ముచ్చెమటలు పట్టించారు. అయితే చివరికి తిరోత్ సొంత వ్యక్తే ఆయనకు ద్రోహం చేశారు. బ్రిటీష్ వారు ఇచ్చిన బంగారు నాణేలకు అమ్ముడుపోయి తిరోట్ ఉండే రహస్య స్థావరాన్ని శత్రువులకు తెలియజేశారు. దీంతో దొంగచాటుగా బ్రిటీష్ మూకలు ఆయనను చుట్టుముట్టి కాల్చారు. తీవ్రంగా గాయపడిన తిరోత్ ను ఢాకాకు బహిష్కరించారు. అక్కడ ఆయన 1935 జూలై 17వ తేదీన తన 33 ఏళ్ల వయస్సులో మరణించారు. ఇప్పటికీ మేఘాలయ ప్రజలు ప్రతి జూలై 17వ తేదీన తిరోత్ దినంగా జరుపుకుంటారు.