బ్రిటీషర్ల ఆక్ర‌మ‌ణ‌ను వ్య‌తిరేకిస్తూ జీవిత కాలం పోరాడిన నాగా వీరుడు జడోనాంగ్

Jul 22, 2022, 12:58 PM IST

దేశ స్వాతంత్ర పోరాటంలో ఈశాన్య రాష్ట్రాల పాత్ర సరిగా గుర్తింపున‌కు నోచుకోలేదు. 

ఈ ప్రాంతంలోని వివిధ తెగలకు బ్రిటిష్ వారికి బీక‌రంగా పోరాటాలు జ‌రిగిన చ‌రిత్ర ఉంది. పురాణ నాగా నాయకుడు హైపౌ జడోలాంగ్ మలంగ్మే స్ఫూర్తిదాయకమైన కథ కూడా ఇందులో ఒక‌టిగా ఉంది. 

జడోలాంగ్ 1905లో మణిపూర్ లోని కాంబిరాన్ గ్రామంలో జెలియాంగ్రోంగ్ కమ్యూనిటీకి చెందిన రోంగ్ మై నాగా తెగలో జ‌న్మించారు. బ్రిటీష్ వారి సాంస్కృతిక, రాజకీయ ఆక్రమణకు వ్యతిరేకంగా ఈశాన్య తెగల త‌రుఫున జీవితకాల యుద్ధం చేసిన మొదటి వ్యక్తిగా ఆయ‌నే నిలిచారు. హేరకా అనే పేరుతో తన సమాజానికి చెందిన సామాజిక రాజకీయ సంస్థ ఏర్పాటు చేశారు. ఆ సంస్థ ఆధ్వ‌ర్యంలోనే తన ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ సంస్థ తన సొంత తెగలో జంతుబలి వంటి తప్పుడు ఆచారాలకు వ్యతిరేకంగా కూడా పోరాడింది, అలాగే బ్రిటిష్ అధికారుల సహాయంతో ఈ తెగ‌ల‌ను క్రైస్తవ మతంలోకి మార్చడానికి విదేశీ మిషనరీలు చేసిన ప్రయత్నాలను కూడా వ్య‌తిరేస్తూ పోరాటాలు చేసింది. 

నాగా రాజు బ్రిటిష్ వారికి సామంతుడుగా మారిపోయాడు. దీంతో జడోనాంగ్ తనను తాను నాగ మెస్సీయ రాజుగా ప్రకటించుకున్నాడు. జడోనాంగ్ నాగా యువకుల సాయుధ సమూహం అయిన రిఫెన్ ను నిర్వహించాడు. వారిలో ఆయ‌న బంధువు రాణి గైడిన్లియు కూడా ఉన్నారు, ఆమె తరువాత ఈ ప్రాంతంలోని గొప్ప నాయకులలో ఒకరుగా ఎదిగారు. ఆయ‌న తన గుర్తింపును దాచేందుకు బ్రిటిషర్ల మాదిరిగానే దుస్తులు ధరించి జెలినాగ్రోంగ్ కమ్యూనిటీని నిర్వహించే గుర్రంపై ఈ ప్రాంతం గుండా ప్రయాణించాడు. అయితే ఒక రోజు బ్రిటిష్ ఏజెంట్ ఆర్.సీ.డంకన్ ఆయ‌న‌ను ఆపారు. దుస్తులు తీసేసి గుర్రం పైనుంచి దిగాల‌ని ఆదేశించాడు. కానీ దానికి ఆయ‌న నిరాక‌రించ‌డంతో అత‌డిని బ్రిటీష‌ర్లు అదుపులోకి తీసుకున్నారు.

మహాత్మాగాంధీ ప్రారంభించిన శాసనోల్లంఘన పోరాటంతో జడోనాంగ్ ఉత్తేజితుడయ్యాడు. ఒకసారి గాంధీని కలవడానికి 200 మంది నాగా యువకులతో కలిసి సిల్చార్ కు వెళ్ళాడు. కానీ గాంధీ తన పర్యటనను రద్దు చేసుకోవ‌డంతో ఆ స‌మావేశం జ‌ర‌గ‌లేదు. స్వతంత్ర నాగా దేశాన్ని డిమాండ్ చేస్తూ జడోనాంగ్ సైమన్ కమిషన్ కు ఒక విజ్ఞాపన పత్రాన్ని కూడా సమర్పించాడు.  

జడోనాంగ్ అరెస్టు నాగాలకు ఒక్క సారిగా కోపం తెప్పించింది. వారంతా క‌లిసి బ్రిటిష్ అవుట్ పోస్ట్ లపై దాడులు చేయ‌డం ప్రారంభించారు. దీంతో జ‌డోనాంగ్ ను విడుద‌ల చేశారు. అయితే ఆయ‌న విడుద‌ల అయిన త‌రువాత బ్రిటీష్ ఆక్ర‌మ‌ణ‌దారుల‌పై అంతిమ దాడికి పిలుపునిచ్చాడు. దీంతో ఆయుధాలు సేకరించి దాడులు చేయ‌డం ప్రారంభించారు. దీంతో బ్రిటిష్ అస్సాం రైఫిల్స్ జడోనాంగ్ గ్రామం ప్యూలియన్ వద్ద భీకర దాడి చేసింది. వంద‌లాది మందిని చంపి, ఇళ్ళు, దేవాలయాలను కూల్చివేసింది. ఈ క్ర‌మంలో జడోలాంగ్ 1931 ఫిబ్రవరి 19 న రాణి గైడిన్లియుతో పాటు వందలాది మంది త‌న అనుచరులతో పాటు అరెస్టుకు గుర‌య్యాడు. చివ‌రికి ఇంఫాల్ జైలు వెనుక ఉన్న నంబుల్ నది ఒడ్డున అదే ఏడాది ఆగస్టు 29వ తేదీన తెల్లవారు జామున జడోనాంగ్ ను ఉరితీశారు.