Jul 15, 2022, 3:24 PM IST
భారత స్వాతంత్రోద్యమంలో ఐఎన్ఏ (ఇండియన్ నేషనల్ ఆర్మీ) కీలక పాత్ర పోషించింది. ఇది సుభాష్ చంద్రబోస్, రాష్ బిహారీ బోస్ ల నేతృత్వంలో ఏర్పడింది. అయితే దీనికి యుద్ధ రంగంలో నాయకత్వం వహించిన ప్రముఖులలో జనరల్ మోహన్ సింగ్ ప్రముఖుడు. ఆయన INA మొదటి జనరల్ గా కూడా పని చేశారు.
పంజాబ్‌లోని సియాల్‌కోట్‌లో జన్మించిన మోహన్ సింగ్.. బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ 14వ పంజాబ్ రెజిమెంట్‌లో చేరారు. బ్రిటన్ కోసం మలయాకు పంపిన బలగాలలో ఆయన కూడా సభ్యుడిగా ఉన్నారు. పెరల్ హార్బర్‌పై బాంబు దాడి చేయడంతో జపాన్ కూడా రెండో ప్రపంచ యుద్ధంలో చేరింది. దీంతో వీరు దానిపై పోరాడేందుకు వెళ్లారు. బ్రిటన్, సోవియట్ యూనియన్ USA నేతృత్వంలోని మిత్రరాజ్యాల దళాలకు వ్యతిరేకంగా జపాన్, జర్మనీ ఆసియా మిత్రదేశాలుగా పోరాడాయి. ఆగ్నేయాసియాలోని మిత్రరాజ్యాల దళాలను జపాన్ పరుగులు పెట్టించింది. అయితే జపాన్ చేతిలో అనేక మంది సైనికులు పట్టుబడ్డారు. ఇందులో ఇండియన్ సైనికుడిగా ఉన్న మోహన్ సింగ్ కూడా ఉన్నాడు.
వీరందరినీ జపాన్ జైలులో ఉంచింది. అయితే జాతీయవాద భారతీయ సైనికులు బ్రిటన్‌కు వ్యతిరేకంగా మారడంతో ఇండిపెండెంట్ విభాగంగా వ్యవస్థీకరించబడ్డారు. జపాన్ దీనికి పూర్తి మద్దతునిచ్చింది. ఆజాద్ హింద్ ఫౌజ్‌ను ఏర్పాటు చేసి సుమారు 40,000 మంది భారతీయులను విడుదల చేసింది. దాని నాయకులలో మోహన్ సింగ్, ప్రీతమ్ ధిల్లాన్ ఉన్నారు. అయితే కొంతకాలం తర్వాత మోహన్ సింగ్ జపాన్ ఉద్దేశాలను అనుమానించి వారితో విభేదించాడు. దీంతో అతడిని జపాన్ కష్టడీలోకి తీసుకుంది.
దీంతో నేతాజీ సుభాష్ చంద్రబోస్ టోక్యో చేరుకున్నారు. అక్కడి అధికారులతో చర్చించిన తర్వాతే ఆయనను విడుదల చేసింది. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓడిపోయిన తరువాత బ్రిటన్ INA సైనికులందరినీ చుట్టుముట్టింది. చారిత్రాత్మక ఎర్రకోటలో వారిని విచారించడానికి ప్రయత్నించింది. అయితే అదే సమయంలో భారతదేశానికి స్వతంత్రం రావడంతో INA సైనికులందరికీ విముక్తి లభించింది. స్వతంత్ర భారతంలో మోహన్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ నుంచే రాజ్యసభకు ఎన్నికయ్యారు. తన 80వ ఏట 1989లో ఆయన తుది శ్వాస విడిచారు.