Jun 16, 2022, 12:07 PM IST
ప్రపంచ చరిత్రలో భారత స్వాతంత్య్ర ఉద్యమానికి ప్రత్యేక స్థానం ఉంది. భారత స్వాతంత్య్రం కోసం భారత పౌరులే కాదు అంతర్జాతీయంగా అనేక మంది మద్దతు తెలుపుతూ పోరాటం సాగించారు. భారత స్వేచ్ఛా, స్వాతంత్య్రాల కోసం మద్దతు తెలుపుతూ.. అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న వారిలో బ్రిటిష్ వారితో పాటు అనేక మంది యూరోపియన్లు ఉన్నారు. జాతీయవాదం ఒక దేశం లేదా ఒక మతానికి చెందిన సంకుచిత పరిమితులలో బంధించబడదని వారు నిరూపించారు. వారిలో ప్రముఖంగా వినిపించే పేరు దిగ్గజ జర్నలిస్టు బెంజమిన్ గై హార్నిమాన్.
1873లో బ్రిటన్ లోని ససెక్స్ లో జన్మించిన హార్నిమన్.. కలకత్తాలో ది స్టేట్స్ మన్ అనే పత్రికలో చేరడానికి భారతదేశానికి వచ్చాడు. కాంగ్రెస్ నాయకుడు ఫిరోజ్ షా మెహతా స్థాపించిన బాంబే క్రానికల్ సంపాదకుడిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత జాతీయవాదిగా ఆయన అడుగులు ముందుకుసాగాయి. హార్నిమాన్ బొంబాయి క్రానికల్ ను భారత జాతీయోద్యమానికి శక్తివంతమైన గళంగా తీసుకువచ్చారు. హార్నిమన్.. అన్నే బియాంట్ ఆధ్వర్యంలో హోమ్ రూల్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ అయ్యారు. ఆ తర్వాత రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా సత్యాగ్రహ సభకు ఉపాధ్యక్షుడిగా గాంధీ ఆయనను నియమించాడు. జలియన్ వాలాబాగ్ వద్ద జరిగిన క్రూరమైన ఊచకోతను హార్నిమాన్, ఆయన వెంటవున్న రిపోర్టర్ గోవర్ధన్ దాస్ ప్రపంచం దృష్టికి తీసుకువచ్చారు. బ్రిటిష్ అధికారులు విధించిన నిషేధాన్ని ధిక్కరించి, జలియన్ వాలా బాగ్ వద్ద బ్రిటిష్ క్రూరత్వానికి సంబంధించిన దిగ్భ్రాంతికరమైన ఫోటోలను, అనేక నివేదికలను ప్రపంచ ముందు ఉంచారు.
జలియన్ వాలా బాగ్ నివేదికలు, ఫోటోలు బ్రిటిష్ ప్రజలను ఎంతగానో ప్రభావితం చేసింది. అయితే, బ్రిటిష్ సర్కారు గోవర్ధన్ దాస్ ను అరెస్టు చేసింది. హార్నిమాన్ ను లండన్ నుంచి బహిష్కరించారు. దీని కారణంగా బాంబే క్రానికల్ మూసివేయబడింది. హార్నిమన్ బహిష్కరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన తెలపాలని గాంధీ పిలుపునిచ్చారు. కానీ హార్నిమన్ బ్రిటన్ లో కూడా భారతీయ ప్రయోజనం కోసం ఉద్యమాన్ని కొనసాగించాడు. జలియన్ వాలా బాగ్ క్రూరత్వాల నుండి కల్నల్ రెజినాల్డ్ డయ్యర్ ను నిర్దోషిగా ప్రకటించిన హంటర్ కమిషన్ ను అతను బహిర్గతం చేశాడు.
హార్నిమన్ 1926లో భారతదేశానికి తిరిగివచ్చి మళ్ళీ బొంబాయి క్రానికల్ ను బాధ్యతలను స్వీకరించి తన జాతీయవాద జర్నలిజాన్ని కొనసాగించాడు. ఆ తర్వాత ఆయన ది ఇండియన్ నేషనల్ హెరాల్డ్, సెంటినెల్ వంటి తన స్వంత వార్తాపత్రికలను ప్రారంభించాడు. ఇవి కూడా భారత స్వాతంత్య్రానికి మద్దతుగా నిలిచాయి. హార్నిమన్ భారతదేశపు మొట్టమొదటి వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్, ఇండియన్ ప్రెస్ అసోసియేషన్ ను స్థాపించి పత్రికా స్వేచ్ఛను అణిచివేసేందుకు బ్రిటిష్ చేసిన ప్రయత్నాలకు వ్యతిరేకంగా పోరాడాడు. పోథెన్ జోసెఫ్ వంటి గొప్ప పాత్రికేయులకు హార్నిమాన్ మార్గదర్శకత్వం వహించాడు. భారత స్వాతంత్య్ర పోరాటంలో చెరగని ముద్రవేసిన హార్నిమన్ 1948లో తుదిశ్వాస విడిచారు.