Jun 22, 2022, 11:14 AM IST
భారత స్వాతంత్ర పోరాటంలో ఆంగ్లేయులను ఎదురించడానికి సంబంధించిన సామాన్య ప్రజల పోరాట ఘట్టాలు ఎంతో స్ఫూర్తిని నింపుతాయి. అలాంటి వాటిలో చెప్పుకోవాల్సిన ప్రత్యేకమైన పోరాటం అరేబియా సముద్ర తీరాన చోటుచేసుకుంది. ఈస్ట్ ఇండియా కంపెనీ కేవలం వాణిజ్యం కొనసాగిస్తూ.. దాని రాజకీయ అధిపత్యాన్ని స్థాపించడానికి ప్రయత్నాలు జరుగుతున్న రోజులవి. 18వ శాతాబ్దం రెండో దశాబ్దంలో పెరుగుతున్న డచ్ శక్తికి కళ్లెం వేయడానికి అట్టింగల్ రాణి మిరియాల కొనుగోలు అనుమతి-సంబంధిత అంశాల గుత్తాధిపత్యాన్ని ఆంగ్లేయులకు అప్పగించారు. తిరువనంతపురం శివార్లలోని అంచుతెంగు కోట బొంబాయి తర్వాత ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి రెండవ అతిపెద్ద వాణిజ్య కోట. డచ్ వారి కంటే దారుణంగా అంచుతెంగు కోటపై ఆంగ్లేయులు ఆధారపడుతూ.. స్థానిక ప్రజలను అణచివేస్తూ.. వారిపై దాడులు, దోచుకోవడం వంటి దారుణాలకు తెరలేపారు. ఈ ప్రాంతంలోని హిందువులు-ముస్లింలు ఆంగ్లేయుల నుంచి ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే అంచుతెంగ్ , అట్టింగల్ వాసులు ప్రతీకారం తీర్చుకునే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. కొంతమంది ఎట్టువీట్టిల్ పిళ్లైలు, సామంతులు.. ఆంగ్లేయులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలను సమీకరించారు. ఏప్రిల్ 14, 1721.. ఈస్ట్ ఇండియా కంపెనీ స్థానిక అధిపతి విలియం గైఫోర్డ్ 140 మంది సైనికులు, బానిసలతో కలిసి వామనపురం నది గుండా పడవలో ప్రయాణిస్తున్నాడు. వారు బహుమతులు మరియు నివాళులు సమర్పించడానికి రాణిని కలవడానికి వెళ్తున్నారు.ఆంగ్లేయులపై ప్రతికారం తీర్చుకోవాలనుకున్న స్థానికులు.. కంపెనీ పార్టీ ప్యాలెస్ లోపల వారు ఉన్నప్పుడు దాడి చేశారు. గంటల తరబడి సాగిన యుద్ధంలో ఒక్క ఆంగ్లేయుడిని కూడా సజీవంగా ఉంచలేదు. మృతదేహాలతో వామనపురం ఎరుపెక్కింది. ప్రజలను తన నోటిదురుసుతో మందలిస్తూ అవమానపర్చిన గైఫోర్డ్ ను ఒక దుంగకు కట్టి, తన నాలుకను బయటకు తీసి కట్టిన పరిస్థితితో నదిలోకి విసిరేయబడ్డాడు. త్వరలోనే అంచుతెంగ్ కోటను కూడా ప్రజలు జయించారు. భారతదేశంలో ఆంగ్లేయుల అధికారాన్ని స్థాపించిన ప్లాసీ యుద్ధానికి 36 సంవత్సరాల ముందు ఇది జరిగింది. భారతదేశ మొదటి స్వాతంత్య్ర సంగ్రామానికి 136 సంవత్సరాల ముందు. భారతదేశంలోని సాధారణ ప్రజలు అన్ని విభేదాలకు అతీతంగా చేతులు కలిపి, మరింత మెరుగ్గా సన్నద్ధమైన ఆక్రమణదారులను తరిమికొట్టిన చారిత్రాత్మక క్షణమది.