Oct 14, 2019, 6:55 PM IST
అక్టోబర్ అంటేనే పండుగల నెల. ఎటు చూసినా తీపి పదార్థాలే కనిపిస్తాయి. సంవత్సరం మొత్తంలో ఈ నెలలో మాత్రం స్వీట్స్ తినడానికి ఎవరి అనుమతీ తీసుకోం..మన డైటింగ్ పక్కన పెట్టి కడుపును తీపి చేస్తుంటాం. దేశంలో ఎక్కువమంది ఇష్టపడే కొన్ని స్వీట్ల విశేషాలు మీ కోసం..
1. జార్ఖండ్ లో చేసే మల్పువా. పిండి, పాలు, చక్కెర, అరటిపండు గుజ్జు లేదా కొబ్బరిగుజ్జు కలిపి తయారుచేసే తీపిపదార్థం మల్పువా. దీన్ని పూరీల్లా చేసి నూనెలో వేయిస్తారు. చివర్లు కరకరలాడుతూ మధ్యలో మృధువుగా ఉంటూ ఎంతో రుచిగా ఉంటాయి. పాన్ కేక్స్ ఇష్టపడేవారు ఈ మల్పువాను అస్సలు వదలరు.
2. కర్నాటకలో చేసే మైసూర్ పాక్. దక్షిణ భారతదేశంలో బాగా ప్రసిద్ధి చెందిన తీపి వంటకం మైసూర్ పాక్. శనగపిండి, చక్కెర, నెయ్యి కలిపి చేస్తారు. మైసూరును పాలించే క్రిష్ణిరాజ వడియార్ దగ్గరి హెడ్ కుక్ దీన్ని కనిపెట్టాడట. మహారాజును మెప్పించండి కోసం ఏదో ప్రయోగం చేస్తే ఇలాంటి అద్భుతమైన వంటకం తయారైందని చెబుతుంటారు.
3. మహారాష్ట్రలోని పూరన్ పోలీ. పర్వదినాల్లో ప్రత్యేకంగా చేసే వంటకం పూరన్ పోలీ. శనగపప్పు ఉడికించి, బెల్లం కలిపి ముద్దలా తయారు చేస్తారు. గోధుమపిండిలో పాలు, నెయ్యి వేసి కలుపుతారు. ముందు తయారుచేసిన పప్పుబెల్లంముద్దను మధ్యలో పెట్టి పూరీలా వత్తి కాలుస్తారు. రుచి అద్భుతంగా ఉంటుంది. సువాసన ఆకలిని రెచ్చగొడుతుంది. దీపావళి, జన్మాష్టమి, వినాయకచవితిలాంటి పండుగలకు తప్పనిసరిగా చేస్తారు.
4. ఒడిస్సాలో చేసే చెనాపొడ. మనదేశపు ఛీజ్ కేక్ ఇది. రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఒక్కసారైనా రుచి చూడాల్సిన వంటకం.
5. రాజస్థానీ గేవర్. తీజ్, రాఖీ పండుగల సమయంలో తప్పనిసరిగా చేసే వంటకం. మైదా, పాలు, దేశీయ నెయ్యితో చేసే మలాయ్ గేవర్ గుండ్రంగా ఉండే అతిమధురమైన తీపి పదార్ధం.
6. ఉత్తర్ ప్రదేశ్ లోని మలైయో. చలికాలంలో మాత్రమే దొరికే ఈ తీపిపదార్థం రుచిలో అమృతంలాగా ఉంటుంది. నోట్లో వేసుకోగానే కరిగిపోయే మలైయో ఒక్కసారి తింటే అస్సలు వదలిపెట్టరు.