Oct 16, 2019, 8:49 PM IST
బరువు తగ్గడానికి అందరూ ముందుగా చేసే పని డైట్ ఫాలో అవ్వడం. కొవ్వు పదార్ధాలు, చెక్కర వంటి వాటికి దూరంగా ఉంటూ.. కేవలం ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే తీసుకుంటారు. కానీ డైట్ ఫాలో అవ్వడం అందరి వల్లా కాదు. మరీ ముఖ్యంగా డైట్ లో ఉన్నప్పుడే రకరకాల ఆహార పదార్థాలు తినాలనే కోరిక కలుగుతూ ఉంటుంది. అలాంటి వారి కోసం ఈ ఆహార దినోత్సవం సందర్భంగా ఓ సూపర్ ఐడియా ఇస్తున్నాం. మీ ఆహార కోరికలను కంట్రోల్ చేసుకోవడానికి ఈ కింది లిస్ట్ ని ఫాలో అపోపోతే సరిపోతుంది.
1. మంచినీరు.. ఎక్కువగా దాహం వేసినప్పుడు చాలా మందికి ఆకలివేసినట్లు అనిపించడం.. ప్రత్యేకించి ఒక రకమైన ఫుడ్ తినాలనే కోరిక కలుగుతుంది. అలాంటి సమయంలో ఒక పెద్ద గ్లాసు మంచినీరు తాగితే.. ఆ ఆహారం తినాలనే కోరిక అక్కడితో ఆగిపోతోంది. నిజానికి మీకు ఆ సమయంలో ఆకలి కాలేదు. శరీరానికి మంచినీరు అవసరమైనప్పుడు కూడా అలా అనిపిస్తుంది.
2.ఎక్కువ సేపు ఆకలితో ఉండకూడదు.... మనకు ప్రత్యేకించి ఈ ఆహారమే తినాలి అనే కోరిక.. కేవలం ఆకలిగా ఉన్నప్పుడే కలుగుతుంది. అందుకే ఎక్కువ సేపు ఆకలితో ఉండకూడదు. తినుబండారాలు, జంక్ ఫుడ్స్ లాంటివి కాకుండా ఆరోగ్యకరమైన వాటిని మధ్య మధ్యలో తీసుకోవడం మంచిది. అది కూడా ఇంట్లో చేసినవి తినడం ఉత్తమం.
3. ఒత్తిడి.. మీరు గమనించారో లేదో.. చాలా మంది ఒత్తిడిలో ఉన్నామంటూ చాక్లెట్లు, ఇంకేదైనా ఫుడ్ తింటూ ఉంటారు. నిజానికి వారికి ఆకలి లేకపోయినా... ఒత్తిడి కారణాన్ని చూపి తినేస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా అమ్మాయిల్లో ఇది ఎక్కువగా కనపడుతుంది. ఒత్తిడి ఎక్కువగా గురైతే శరీరంలో కొలిస్ట్రాల్ పెరిగి... బరువు పెరుగుతుంటారు.
4.మంచి నిద్ర.. ఆరోగ్యకరంగా ఉండాలనుకునేవారు ప్రశాంతంగా నిద్ర పోగలగాలి. మంచి నిద్ర పోయినవారితో పోలిస్తే... నిద్రలేమి వారిలో 55శాతం అధికంగా ఉబకాయం వచ్చే ప్రమాదం ఉంది. నిద్రలేకపోతే హార్మోన్లు సాధారణంగా ఉండకుండా.. పెరగుతూ, తగ్గుతూ ఉంటాయి. దీని వల్ల కూడా ఏదో ఒక ఆహారం తినాలనే కోరికలు కలుగుతూ ఉంటాయి.
5. ప్రశాంతంగా తినడం... ఆహారం తీసుకునేటప్పుడు... మనకు ఆకలిగా ఉందా.. ఆహారం తినాలని ఉందా అన్న విషయం తెలుసుకోవాలి. కంగారుగా, హడావిడిగా తిండి తినడం మానేయాలి. ప్రశాంతంగా కూర్చొని ఆహారాన్ని ఆస్వాదిస్తూ.. నమిలి తినాలి. టీవీ, స్మార్ట్ ఫోన్లు చూస్తూ తినడం లాంటివి చేయకూడదు.