Jul 2, 2022, 3:19 PM IST
భారత స్వాతంత్య్రం కోసం కుల, మత, జాతి, వర్గ భేదాలతో సంబంధం లేకుండా.. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాటం సాగింది. అనేక మంది గిరిజన నాయకులు సైతం ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాటం సాగించి.. భారత చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. అలాంటి గిరిజన నాయకులలో మొదటగా వినిపించే పేరు బిర్సా ముండా. భారత స్వాతంత్య్ర పోరాటంలో తనకుంటూ ఒక ప్రత్యేక పేజీని లిఖించుకున్న ఆయన గౌరవార్థం భారత పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో బిర్సా ముండా చిత్రపటాన్ని ఉంచారు. ఈ గౌరవం దక్కిన ఏకైన గిరిజన నాయకుడు బిర్సా ముండా. దేశంలో ఆంగ్లేయుల పాలన కొనసాగుతున్న రోజుల్లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా గిరిజన సమూహాలు సాగించిన తిరుగుబాటు ఉద్యమానికి బిర్సా ముండా నాయకత్వం వహించారు. బిర్సా ముండా (1875–1900) భారతీయ అటవీ జాతుల స్వాతంత్ర్య సమరయోధుడు.. జానపద నాయకుడు. ముండా జాతికి చెందిన ఆయన 19వ శతాబ్దపు చివరి రోజుల్లో నేటి బీహార్, ఝార్ఖండ్ ఆటవిక ప్రాంతాల్లో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాన్ని ముందుకు నడిపాడు. అడవులు, కొండలు, కోనలు ఆదివాసీలకు అనాదిగా జీవనోపాధిని కల్పిస్తున్నాయి. ఇవి వారి జీవనంలో ఒక భాగం. అయితే, వలస పాలకులు తీసుకున్న నిర్ణయాలు, చర్యల కారణంగా వారిని అటవీ ప్రాంతాల నుంచి వెళ్లగొట్టేందుకు దారితీశాయి. గిరిజనుల భూములను స్వాధీనం చేసుకోవడంతో పాటు వారిని దోచుకోవడం, హింసించడం వంచి చర్యలు పెరిగాయి. ఆర్థికంగా దోపిడీకి గురైన గిరిజనుల సాంస్కృతిక గుర్తింపు కూడా ప్రమాదంలో పడింది. ఆంగ్లేయుల మద్దతుతో విదేశీ మిషనరీలు ప్రారంభించిన పెద్ద ఎత్తున మత మార్పిడి గిరిజన ప్రపంచాన్ని అంతం దశకు మార్చింది. వందలాది మంది బిర్సా కుటుంబాలు క్రైస్తవ మతంలోకి మారాయి. ఈ క్రమంలోనే బిర్సా ముండా.. బిర్సా డేవిడ్ అయ్యాడు. ఆయన జర్మన్ మిషన్ పాఠశాలలో చేరాడు. అయితే, తాను ఎదుగుతున్న కొద్ది ఆంగ్లేయుల ఆగడాలు, క్రూర చర్యలు, అణచివేతలు చూసిన బిర్సా.. బ్రిటిష్ వలసవాదులకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. ఈ పోరాటంలో భాగంగా తన క్రైస్తవ గుర్తింపును విడిచిపెట్టాడు. బ్రిటీష్‌కు వ్యతిరేకంగా ఉద్యమించడానికి గిరిజనులను సమీకరించాడు. Down with the Queen’s rule, Lets rise to have our own rule అంటూ నినాదంతో ముందుకు సాగాడు. చిన్న వయస్సులోనే అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా ఎదిగాడు. బిర్సా సమాజానికి పెద్ద నేతగా ఎదిగాడు. బిర్సా నేతృత్వంలోని సాయుధ గిరిజన ఉద్యమం ఈ ప్రాంతం అంతటా వ్యాపించింది. ఆంగ్లేయుల నివాసాలు, పోలీస్ స్టేషన్లపై దాడులు జరిగాయి. వందల మంది రక్తం చిందించారు. అయితే, ఈస్టిండియా కంపెనీ పెద్ద మొత్తంలో బ్రిటిష్ సైన్యాన్ని మోహరించి.. గిరిజనులను క్రూరంగా అణచివేసింది. వందల మంది ప్రాణాలు తీశారు. బిర్సా మొదట సింభూమ్ కొండలకు తప్పించుకున్నప్పటికీ, తర్వాత చక్రధర్‌పూర్ అడవుల్లో పట్టుబడ్డాడు. 25 సంవత్సరాల వయస్సులో బిర్సా ముండా బ్రిటీష్ జైలులో అమరవీరుడయ్యాడు. దేశంలోని అనేక ప్రాంతాలు ఇప్పటికీ బిర్సా పుట్టిన రోజును పెద్ద పండుగగా జరుపుకుంటాయి.