Sep 8, 2022, 12:15 PM IST
నల్గొండ : బిజెపిలో చేరిన తమ్ముడి కోసం కన్నతల్లిలాంటి కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసేందుకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సిద్దమయ్యారంటూ మునుగోడు మండలం ఊకోండి ఎంపిటిసి భర్త పాలగోని సైదులు ఆరోపించారు. మునుగోడు ఉపఎన్నికల్లో బిజెపి నుండి పోటీచేసే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మద్దతివ్వాలంటూ స్వయంగా ఎంపీ వెంకట్ రెడ్డి తనకు ఎంపీ ఫోన్ చెప్పారంటూ సైదులు తెలిపాడు. ఇలా తనకే కాదు చాలామంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపై వెంకట్ రెడ్డి ఒత్తిడి తెస్తున్న మాట వాస్తవమేనని అన్నారు. తన ఆరోపణల్లో నిజం లేదని నిరూపించుకోవాలంటే వెంకట్ రెడ్డి కాంగ్రెస్ జెండాపై ప్రమాణం చేసి కాంగ్రెస్ కు ద్రోహం చేయడంలేదని చెప్పాలని సైదులు సవాల్ చేసారు. కాంగ్రెస్ పార్టీలో వుంటూ ఇలా ద్రోహం చేయడం తగదని... కావాలంటూ బిజెపిలో చేరి తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి మద్దతిచ్చుకోవాలంటూ వెంకట్ రెడ్డికి సైదులు సూచించారు.