Sep 8, 2022, 1:06 PM IST
పల్నాడు : ఆ ఆదిదేవుడు వినాయకుడి నిమజ్జనాన్ని కూడా రాజకీయం చేసిన తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు సృష్టించిన ఘటన ఆంధ్ర ప్రదేశ్ లో చోటుచేసుకుంది. పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గ పరిధిలోని ఈపూరు మండలం కొచ్చర్ల గ్రామంలో బుధవారం రాత్రి అలజడి రేగింది. గ్రామానికి చెందిన వైసిపి వర్గీయులు వినాయక నిమజ్జనం కోసం భారీ ఏర్పాట్లు చేసుకున్నారు. ఇలా వినాయక విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళుతున్న క్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తల ఇళ్లు కనిపించడంతో వైసిపి వర్గీయులు రెచ్చిపోయారు. టిడిపి వర్గీయుల ఇళ్లపై రాళ్లదాడికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ రాళ్లదాడిలో అనురాధ, శేషయ్య, లోకేష్ తీవ్రంగా గాయపడ్డారు. వైసిపి వర్గీయుల రాళ్లదాడిపై ఫిర్యాదుచేసినా పోలీసులు స్పందించడంలేదంటూ టిడిపి వర్గం పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టింది. ఇవాళ తెల్లవారుజామున 3-4 గంటల వరకు ఆందోళన కొనసాగగా స్థానిక ఎస్సై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో శాంతించిన టిడిపి వర్గీయులు ఇళ్లకు వెళ్ళిపోయారు.