విశాఖ రైల్వే జోన్ ప్రచారంపై విజయసాయి రెడ్డి క్లారిటీ... రాజీనామాకు సిద్దమేనంటూ సంచలనం

Sep 28, 2022, 2:48 PM IST

తాడేపల్లి : మంగళవారం కేంద్ర హోంశాఖ సమక్షంలో ఆంధ్ర ప్రదేశ్ విభజన చట్టంలో అంశాలపై ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య చర్చలు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశంలో ఏపీకి అన్యాయం జరిగేలా కేంద్ర నిర్ణయాలు తీసుకుందని... విశాఖ రైల్వే జోన్ ఇవ్వడం సాధ్యంకాదంటూ తేల్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు. విశాఖ రైల్వే జోన్ పై జరుగుతున్నదంతా తప్పుడు ప్రచారమని... నిన్నటి సమావేశంలో దీనిపై అసలు చర్చే జరగలేదని ఆయన స్పష్టం చేసారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖకు రైల్వే జోన్ వచ్చి తీరుతుందని విజయసాయి రెడ్డి స్ఫష్టం చేసారు. విశాఖకు రైల్వే జోన్ ఇస్తామని స్వయంగా కేంద్ర రైల్వే మంత్రే తనతో చెప్పారన్నారు. ఒకవేళ విశాఖకు రైల్వే జోన్ రాకపోతే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని విజయసాయి రెడ్డి ఛాలెంజ్ చేసారు. టిడిపి అనుకూల మీడియా కావాలనే వైసిపి ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టేలా విశాఖ రైల్వే జోన్ పై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తోందని విజయసాయి మండిపడ్డారు.