Oct 18, 2022, 12:17 PM IST
నెల్లూరు : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇటీవల వైజాగ్ లో చోటుచేసుకున్న ఘటనలపై పవన్ చేసిన వ్యాఖ్యలను అనిల్ ఖండించారు. అయ్యా పీకే... నువ్వేదో పీకేస్తానంటూ మాట్లాడావు... కానీ ఈ వైసిపి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి జగన్ ను, మా కార్యకర్తలను పీకేసేంత సత్తా నీకు లేదని తెలుసుకో అంటూ విమర్శించారు.
అప్పుడుప్పుడు సినిమాల్లో క్లైమాక్స్ పంచు డైలాగులు వేయడం తప్ప నువ్వేమీ పీకలేవు అంటూ ఎద్దేవా చేసారు. విజయవాడ నుండి వైజాగ్ వరకు దొర్లి దండాలు పెట్టు... నువ్వేమీ పీకలేవు పీకే అంటూ మండిపడ్డారు. ఆల్ కట్టల్ కట్టుకుని రండి... బడితెపూజ చేసి ఈ రాష్ట్రం నుండి తరిమికొడతాం అంటూ హెచ్చరించారు. మీరందరూ కట్టకట్టుకుని వచ్చినా 2024 లో విజయం వైసీపీ దే అన్నారు అనిల్. నువ్వు చంద్రబాబు దత్తపుత్రుడివని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. ముఖ్యమంత్రి, ప్రతిపక్షనాయకుడు కాదు ముందు నువ్వు ఎమ్మెల్యేగా గెలువు అంటూ ఎద్దేవా చేసారు. అభిమానులు ఉడుకు రక్తంతో పవన్ వెంట తిరగడం మానుకోండి... ఆయన సీఎం అవ్వడం ఓ కలగానే మిగిలిపోతుందని మాజీ మంత్రి అనిల్ అన్నారు.