ఈ ఒక్కసారి చాలు... వచ్చే 30ఏళ్లు అధికారం మనదే..: జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు

Nov 16, 2022, 4:19 PM IST

తాడేపల్లి :  రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి విజయం సాధిస్తే ఇక తిరుగే వుండదని.. ఆ తర్వాత 30 ఏళ్లు అధికారంలో తామే వుంటామని వైసిపి అధినేత, సీఎం జగన్ పేర్కొన్నారు. నేను చేయాల్సింది నేను, మీరు చేయాల్సింది మీరు... ఓ అవగాహనతో పనిచేస్తే గత రికార్డులు బద్దలుగొట్టొచ్చని అన్నారు. ఖచ్చితంగా రాష్ట్రంలోని 175కు 175 సీట్లు ఎందుకు రాకూడదనే టార్గెట్ తో ముందుకు వెళదామని... ఇదేమీ అసాధ్యం కాదన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఇంట్లోనూ సంక్షేమం, అభివృద్ది కనిపిస్తోంది... మన పాలనలో ప్రతి ఒక్కరికీ మేలు జరుగుతోంది కాబట్టి మన టార్గెట్ తప్పకుండా పూర్తవుతుందని జగన్ ధీమా వ్యక్తం చేసారు. విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో సీఎం క్యాంపు కార్యాలయంలో సమావేశమైన జగన్ దిశానిర్దేశం చేసారు. చాలా గొప్పనైన సచివాలయం, వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చామని... ఆ దేవుడి దయతో మ్యానిఫెస్టోలో పెట్టిన ప్రతి హామీని తూచా తప్పకుండా 98 శాతం నెరవేర్చాకే ప్రజల వద్దకు వెళుతున్నామని అన్నారు. గడపగడపకు కార్యక్రమంతో ప్రభుత్వాన్ని ప్రతి వార్డుకు, ప్రతి ఇంటికి తీసుకువెళుతున్నామని... ఈ కార్యక్రమంలో అందరి భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు. చాలా పాదర్శకంగా, వివక్షకు, లంచాలకు ఏమాత్రం తావులేకుండా పారదర్శకంగా పాలన సాగుతోందని జగన్ తెలిపారు.