Aug 28, 2022, 11:40 AM IST
అవనిగడ్డ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రజల్లోకి వెళుతున్న కొందరు వైసిపి ఎమ్మెల్యేలకు చేధు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఇలా ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు ప్రజల నుండి తిరుబాటు ఎదురవగా తాజాగా కృష్ణా జిల్లా అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబుకు ఇలాంటి అనుభవమే ఎదురయ్యింది. మోపిదేవి మండలం పెదప్రోలు గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు స్థానిక ఎమ్మెల్యే రమేష్ బాబు. ఈ క్రమంలో ఓ ఇంటివద్దకు వెళ్లిన ఎమ్మెల్యేను ఓ యువకుడు నిలదీసాడు.
గత రెండుసంవత్సరాలుగా (2019-20, 2020-21) విద్యాసంవత్సానికి గాను విద్యాదీవెన కింద తనకు ప్రభుత్వం నుండి రావాల్సిన రూ.80వేలు రాలేవని... దీంతో చదువు అర్ధాంతరంగా ఆగిపోయిందంటూ ఎమ్మెల్యేతో చెప్పుకున్నాడు. కరోనా కారణంగానే ఈ సమస్య తలెత్తిందని ఎమ్మెల్యే సర్దిచెప్పే ప్రయత్నం చేసాడు. అయినప్పటికి వైసిపి ప్రభుత్వంతో పాటు తనను విమర్శించేలా మాట్లాడటంతో తీవ్ర అసహనానికి గురయి ఎవడ్రా నువ్వు నాతో మాట్లాడేందుకు? అంటూ యువకుడి పైపైకి వెళ్ళాడు ఎమ్మెల్యే. అయినప్పటికి యువకుడు ఏమాత్రం భయపడకుండా ఎమ్మెల్యే రమేష్ బాబుకు ఎదురు నిలిచాడు.