Jul 27, 2022, 10:45 AM IST
గన్నవరం : కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కోడూరుపాడులో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామ శివారులో కోడిపందాలు ఆడుతున్న కొందరిని ఇటీవల వీరవల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే వీరిలో డిగ్రీ చదువుతున్న విద్యార్థి వసంత్ అనే యువకుడు వున్నాడు. తాను కోడిపందేలు ఆడకున్నా పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడమే కాదు మోకాళ్లపై కూర్చోబెట్టి అవమానించారంటూ తీవ్ర మనోవేదనకు గురయిన యువకుడు సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అయితే ఉరివేసుకున్న వసంత్ ను గమనించిన కుటుంబసభ్యులు హాస్పిటల్ కు తరలించారు. అతడి పరిస్థితి విషమంగా వున్నట్లు సమాచారం.
తన కొడుకు ఆత్మహత్యాయత్నానికి పోలీసులే కారణమని వసంత్ తల్లి లక్ష్మికుమారి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అంతేకాదు వసంత్ కూడా సూసైడ్ లెటర్ లో తనలాగా మరే విద్యార్థికి అవమానాలు కారణం లేకుండా అన్యాయం జరగకూడదంటూ సీఐ, ఎస్సై తో పాటు కానిస్టేబుల్స్ ను శిక్షించాలంటూ పోలీస ఉన్నతాధికారులను కోరాడు.