Jul 21, 2022, 4:46 PM IST
విశాఖపట్నం : రాత్రి సమయంలో బైక్ లతో రోడ్లపైకి వచ్చి రేసింగ్ కు దిగి హంగామా సృష్టిస్తున్న యువకులను విశాఖ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల ఇలా కొందరు యువకులు నడిరోడ్డుపై బైక్ లతో విన్యాసాలు చేయడమే కాదు ఓ బస్సు డ్రైవర్ తో వాగ్వాదానికి దిగి దాడికి పాల్పడ్డారు. స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియం వద్ద జరిగిన ఈ ఘటనపై పోలీసులు సీరియస్ గా తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు 73 ద్విచక్రవాహనాలను, రేసింగ్ కు పాల్పడిన 85 మంది యువకులను గుర్తించినట్లు ఏసీపీ హర్షిత చంద్ర వెల్లడించారు. ఈ కేసులో 30 మంది వరకు విద్యార్థులు వున్నట్లు ఆమె తెలిపారు. రాత్రివేళల్లో బైక్ రేసింగ్ లు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టినట్లు ఏసిపి తెలిపారు. సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఇలా రేసింగ్ కు సంబధంచిన వివరాలను పంచుకుంటున్నారని అన్నారు. బైక్ రేసింగుల్లో పాల్గొన్న యువకుల పేరెంట్స్ ని పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు ఏసిపి హర్షిత చంద్ర తెలిపారు.