Dec 20, 2020, 1:09 PM IST
కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు ఎంతో భక్తితో తిరుమలకు చేరుకున్న భక్తులకు టిడిపి వ్యవహారశైలి ఆగ్రహాన్ని తెప్పించింది. దీంతో తిరుపతిలోని విష్ణు నివాసం ఎదుట భక్తులు ఆందోళనకు దిగారు. సర్వదర్శనం టోకెన్ల జారీ విషయమై భక్తులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
24వ తేదీ దర్శనం టోకెన్లు ముందస్తుగా ఇవ్వడంపై శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్శనం కోసం నాలుగైదు రోజులు ఎక్కడ ఉండాలంటూ భక్తులు టిటిడి అధికారులను ప్రశ్నిస్తున్నారు. భక్తుల ఆందోళనపై తితిదే స్పందించింది. రోజువారీ పరిమితి దాటడంతో 24వ తేదీ టోకెన్లు ఇస్తున్నామని పేర్కొంది. 21, 22, 23 తేదీల సర్వ దర్శనం టోకెన్లను కూడా ముందుగానే జారీ చేసినట్లు వివరించింది. భక్తులను వెనక్కి పంపకూడదనే ఉద్దేశంతోనే టోకెన్లు ముందస్తుగా జారీ చేసినట్లు తితిదే అధికారులు చెబుతున్నారు.