Teachers Protest in AP: ఉపాధ్యాయుల సీఎంవో ముట్టడి ఉద్రిక్తత... 144సెక్షన్ విధింపు

Apr 25, 2022, 10:18 AM IST

విజయవాడ: కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎస్‌)ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ (UTF) ఇవాళ(సోమవారం) ఛలో సీఎంవో కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఉద్రిక్త త నెలకొంది. ఉపాధ్యాయ సంఘం చేపట్టే ఆందోళనకు ఎలాంటి అనుమతిలేదని... గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో సెక్షన్ 144 మరియు సెక్షన్ 30 ఆఫ్ పోలీస్ యాక్ట్ అమలులో వుంటుందని పోలీసులు తెలిపారు. తాడేపల్లి బైపాస్ లో సీఎం క్యాంపు కార్యాలయం వైపు వెళ్లే రోడ్లలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఈ క్రమంలోనే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా భారీగా పోలీసులు మొహరించారు. మూడు జిల్లాల్లోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు మరియు జాతీయ రహదారులపై పికెట్లు ఏర్పాటు చేసారు.  

ప్రకాశం బ్యారేజ్,  అవనిగడ్డ కరకట్ట పై పోలీసులు తనిఖీలు చేపట్టడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. మంగళగిరి ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసారు. తాడేపల్లి బైపాస్ సర్వీస్ రోడ్డు కు మద్యలో ఇనుప ముళ్ల కంచె ఏర్పాటుచేసారు. చినకాకాని వై జంక్షన్, తెనాలి ఫ్లైఓవర్, డిజిపి ఆఫీస్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు.