నర్సీపట్నంలో హై టెన్షన్: అయ్యన్న ఇంటి గోడ కూల్చివేత... భారీగా పోలీసుల మోహరింపు

Jun 19, 2022, 11:45 AM IST

నర్సీపట్నంలో హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది. మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇంటిని ఆదివారం తెల్లవారుజామున పోలీసులు చుట్టుముట్టారు.

నర్సీపట్నంలో అయ్యన్నను అరెస్ట్‌ చేసేందుకు సిద్ధమయ్యారు. చోడవరం మినీ మహానాడులో సీఎం జగన్‎పై అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలు చేశారు. దీంతో నిన్న రాత్రి అయ్యన్నకు నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు వెళ్లారు. అయ్యన్న ఇంటి వెనకాల గోడను జేసీబీతో కూల్చివేశారు. పంట కాల్వ ఆక్రమించి గోడ కట్టారని.. ప్రభుత్వ భూమిలోని రెండు సెంట్లు ఆక్రమించారని నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ నోటీసులో పేర్కొన్నారు. గోడ తొలగించడంపై అయ్యన్న కుటుంబసభ్యులు అభ్యంతరం తెలిపారు.

అయ్యన్నను అరెస్ట్ చేస్తారంటూ అయ్యన్న అనుచరుల ఆందోళనకు దిగారు. కొంతమంది టీడీపీ నేతలను ముందస్తుగా పోలీసులు అరెస్ట్ చేశారు. అయ్యన్న ఇంటి దగ్గర పోలీసులు ఆంక్షలు విధించారు. అంతేకాకుండా మీడియాకు అనుమతి లేదంటూ పోలీసులు మీడియాను అడ్డుకున్నారు. అయ్యన్నపాత్రుడు ఇంటికి వెళ్లే దారులని పోలీసులు మొత్తం మూసివేశారు. అయ్యన్నపై ఇప్పటికే 12 కేసులు నమోదయ్యాయి. అయ్యన్న ఇంటిని పోలీసులు చుట్టుముట్టడంతో అనకాపల్లిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.