జగన్ కోసం వందలకిలోమీటర్లు పాదయాత్ర... ఏపీ పోలీసుల అదుపులో తెలంగాణ యువకుడు

Jul 14, 2021, 2:06 PM IST

తాడేపల్లి: ఆంధ్ర ప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అభిమానంతో వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన తెలంగాణ యువకుడికి చివరకు నిరాశే దక్కింది. తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసానికి చేరుకున్న యువకున్ని భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. అపాయింట్ మెంట్ వుంటేగానీ లోపలికి పంపించబోమంటూ పోలీసులు అడ్డుకున్నప్పటికీ సీఎంను కలవకుండా వెళ్లేది లేదంటూ కన్నీరు పెట్టుకుంటూ అక్కడే కూర్చున్నాడు. దీంతో సదరు యువకున్ని పోలీసులు స్టేషన్ కు తరలించారు.   
 
జూలై 8వ తేదీ వైఎస్సార్ జయంతి రోజున సంగారెడ్డి జిల్లా కేంద్రం సమీపంలోని కంది గ్రామానికి చెందిన పబ్బు కిషోర్‌ తన ప్రియతమ నాయకుడు జగన్ ను కలవడానికి పాదయాత్ర ప్రారంభించాడు. దాదాపు వారం రోజులపాటు నడుస్తూ ఇవాళ అతడు తాడేపల్లిలోని సీఎం నివాసానికి చేరుకున్నాడు. అయితే అతడికి అపాయింట్ మెంట్ లేకపోవడంతో గేటు వద్దే ఆపిన సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.