Aug 26, 2022, 3:50 PM IST
విజయవాడ : మాజీ సీఎం, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిపై ఆయన సొంత నియోజకవర్గంలోనే వైసిపి నాయకులు దాడికి ప్రయత్నించడంతో పాటు రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి వచ్చాక దళితులపై జరుగుతున్న దాడులపై గవర్నర్ కు ఫిర్యాదు చేసినట్లు టిడిపి బృందం తెలిపింది. మాజీ మంత్రులు నక్కా ఆనంద్ బాబు, కేఎస్ జవహర్, పీతల సుజాత, పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి, మాజీ ఎమ్మెల్యేలు తంగిరాల సౌమ్య, తెనాలి శ్రావణ్ కుమార్ తదితరులు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ అయ్యారు.
గవర్నర్ తో భేటీ అనంతరం ఆనంద్ బాబు మాట్లాడుతూ... గతంలో గవర్నర్ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసారు. దళితులపై దాడులు, దౌర్జన్యాలు, ఎస్సీ కార్పోరేషన్ నిధుల దుర్వినియోగం, అంబేద్కర్ విదేశీ విద్య పేరు మార్పు తదితర అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకువచ్చామన్నారు. దళితులపై దాడులు చేయడానికి తమకు పేటెంట్ వున్నట్లుగా వైసిపి నాయకులు వ్యవహరిస్తున్నారని అన్నారు. పక్క రాష్ట్రాల్లో గవర్నర్లు ఏ విధంగా వ్యవహరిస్తున్నారోనని ఈ రాష్ట్ర గవర్నరు గమనించాలని సూచించారు. అయితే ఈసారి తమ ఫిర్యాదులపై తప్పకుండా చర్యలు తీసుకుంటానని... కుప్పం ఘటనపై ఏడీజీ స్థాయి అధికారితో విచారణ చేయిస్తానని గవర్నర్ హామీ ఇచ్చినట్లు మాజీ మంత్రి ఆనంద్ బాబు తెలిపారు.